హైదరాబాద్‌లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఓ ప్రేమికులను కిడ్నాప్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నారాయణ పేట్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రేమికులను సినిమా తరహాలో కిడ్నాప్ చేసి, అడవుల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ సమీపంలో చోటు చేసుకుంది.  


హైదరాబాద్‌లోని సుల్తాన్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నారాయణ పేట నుంచి ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామని యత్నించారు. ఈ క్రమంలో నగరానికి వచ్చిన ప్రేమజంటను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి తరపు బంధువులు వారిని కిడ్నాప్‌ చేసి ఇష్టానుసారంగా దాడి చేశారు. 


నారాయణపేట్‌జిల్లా బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్‌ గౌడ్‌ అనే 23 ఏళ్ల వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరి కులాలు వేరు అవ్వడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు అడ్డు తగిలారు. దీంతో వారు ఇంటి నుంచి వచ్చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నగరంలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుందామని అనుకొని ఈ నెల 3న నగరానికి వచ్చాడు. గురువారం శివ శంకర్‌తో పాటు అతను ప్రేమించిన అమ్మాయి కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆ మాల్‌ సెల్లార్‌లో ఉండగా అమ్మాయి తరపు బంధువులు ఇద్దరిపైనా దాడి జరిపి కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా తరహాలో ప్రేమికులను వారు కారులో ఎక్కించుకొని ప్రియుణ్ని ఇష్టానుసారం కొట్టారు. సుల్తాన్‌ బజార్‌ పోలీస్ స్టేషన్‌ ముందు నుంచి ప్రధాన రోడ్లపైనే వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్ర చిత్రహింసలు పెట్టారు. ఈ దాడిలో శివ శంకర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత సంగనూరుపల్లి ప్రాంతంలో శివశంకర్‌కు బట్టలు మార్పించి, అతణ్ని మద్దూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించి వారి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయారు.


నిందితుల అరెస్టు..
ఈ వ్యవహారంలో యువతి స్నేహితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బడీచౌడీ ఆర్యసమాజ్, కాచిగూడ బిగ్‌బజార్‌ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియో ఫుటేజీని పరిశీలించారు. కారు నెంబరును గుర్తించి వాటి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. కారు ఓనర్‌‌ను గుర్తించి అతని ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు మద్దూర్‌ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. 


దీంతో ఆ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని క్రిష్ణారెడ్డి(43), పి.హరినాథ్‌రెడ్డి (29), జి.తిరుపతి(23), కె.శ్యాంరావురెడ్డి(27), శ్రీనివాస్‌రెడ్డి(23), కె.పవన్‌కుమార్‌రెడ్డి(21)గా గుర్తించారు. అందర్నీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.