Krishna Board Meeting : కృష్ణా జలాల పంపిణీపై నదీ యాజమాన్య బోర్డు ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. కృష్ణా జలాల పంపిణీపై బోర్డు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కృష్ణా బోర్డు 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల వాటాను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు 50:50 వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీకి ఒప్పుకోమని తెలంగాణ తేల్చిచెప్పింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బోర్డును కోరారు. 


ఏపీ 34 టీఎంసీలు మించి వాడుకోకూడదు


తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపుతో పాటు ఇతర  కీలక అంశాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు శుక్రవారం భేటీ అయింది. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ బోర్డు భేటీలో తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో నీటి వినియోగం, ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి వాడుకోరాదని తెలంగాణ అంటోంది. తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని ట్రైబ్యునల్‌కు ఇంకా నివేదించలేదని అధికారులు వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగానికి ఒక్క ఏడాదే అంగీకరించామని రజత్ కుమార్ తెలిపారు. 


శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై వివాదం


కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ 50:50 నిష్పత్తిలో వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలంగాణ అధికారులు బోర్డుకు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమేనని తెలంగాణ అధికారులు అంటున్నారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరం తగదన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, అయినా తెలంగాణకు అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. 


పోటీపడి విద్యుత్ ఉత్పతి 


2021-22లో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై(విద్యుదుత్పత్తి) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పోటీపడి విద్యుదుత్పత్తి చేశారని, తమ ఆదేశాలను ఉల్లంఘించారని బోర్డు అంటోంది. తెలంగాణ 218 టీఎంసీల నీటిని వినియోగించుకుని 281 రోజుల్లో 1217 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఏపీ 200 టీఎంసీలతో 183 రోజుల్లో 1146 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. శ్రీశైలంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేనప్పుడు విద్యుదుత్పత్తి చేశారని బోర్డు తెలిపింది. 501 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళ్లాయని పేర్కొంది. ఇందులో ఎక్కువ నీటిని ఆదా చేయడానికి అవకాశం ఉందని బోర్డు తెలిపింది. ఎజెండాలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.800 కోట్లు, నాగార్జునసాగర్‌, పులిచింతలకు మరో రూ.30 కోట్లు అవసరమని పేర్కొంది.