Hyderabad News : తెలంగాణ సీఎం కే‌సీ‌ఆర్ మనవడు రితేష్ రావు కనిపించడం లేదని రమ్యరావు ఆరోపించారు. రెండ్రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు చొరబడి తన కొడుకుని బలవంతంగా తీసుకెళ్లారన్నారు. ఇప్పటి వరకు రితేష్ రావు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గాలించిన తన కొడుకు ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన చెందారు. శనివారం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు బయలుదేరారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని NSUI అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో NSUI ముఖ్య కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వాళ్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు సీక్రెట్ గా ఉంచడంపై రమ్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


డీజీపీ ఆఫీస్ కు రమ్యరావు 


తన కొడుకు ప్రివేంటీవ్ అరెస్ట్ పై హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి వచ్చారు రమ్య రావు. అనుమతి లేదని పోలీసులు రమ్యరావును అడ్డుకున్నారు. డీజీపీని కలవడానికి అనుమతించక పోవడంపై రమ్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత డీజీపీని కలవడానికి అనుమతించడంతో ఆమె లోపలికి వెళ్లి డీజీపీని కలిశారు. 


"డీజీపీని కలవడానికి వస్తే అపాంట్మెంట్ లేకుండా కలవడం కుదరదు అంటున్నారు. మరి అర్ధరాత్రి మా ఇంట్లోకి చొరబడి మా అబ్బాయిని అరెస్టు చేశారు. మా ఇళ్లలోకి పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా చొరబడ్డారు. కనీసం మహిళా పోలీసులు లేకుండా, ఇంట్లో మహిళలు ఉంటారు అయినా దారుణంగా ప్రవర్తించారు. హోంమంత్రి ఉన్నట్టా లేనట్టా? ఆ మనవడి దగ్గరకి వచ్చే సరికి ఒకలా ఉంటుంది వ్యవహారం, ఇతరుల పిల్లలకైతే మరోలా ఉంటుందా? మహిళలకు ఇదేనా మీరు ఇచ్చే భద్రతా? " - రమ్యరావు, కేసీఆర్ అన్న కుమార్తె  


కాంగ్రెస్ పార్టీలో రమ్యరావు 


కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె తరచూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. ఇటీవల కాస్త సెలైంట్ అయిన ఆమె తాజాగా తన కుమారుడు రితేశ్ రావు అరెస్టుపై ఆమె కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పుడు రమ్యరావును పోలీసులు అరెస్టు కూడా చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు రమ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆమె టీఆర్ఎస్ పార్టీపై పలుమార్లు విమర్శలు చేశారు.  


గతంలో కేసీఆర్ పాలనపై విమర్శలు 


బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. కేసీఆర్ పరిపాలన కారణంగా అనేక మంది కల్వకుంట్ల వంశాన్ని తిడుతున్నారని, కల్వకుంట్ల అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారని తెలిపారు. ఎవరూ కల్వకుంట్ల వంశాన్ని తిట్టొద్దని ఆమె వేడుకున్నారు. తిట్టాలనుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే తిట్టాలన్నారు.  కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని గతంలో ఆమె విమర్శించారు.  ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారన్నారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదన్నారు. బీఆర్ఎస్ పాలన చూశాక తెలంగాణ ఎందుకు వచ్చిందని ఆవేదన చెందుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కన్నా ముందు జెండా పట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడామని రమ్య రావు అన్నారు.