NSUI Ritesh Rao : తన పుట్టినరోజు కూడా జరుపుకోనివ్వడం లేదని కేసీఆర్ మనవడు, ఎన్.ఎస్.యు.ఐ నేత రితేష్ రావు ఆరోపించారు. తన పుట్టినరోజున కూడా హౌస్ అరెస్టు చేసి కేసీఆర్ ప్రభుత్వం వేధిస్తోందని కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నేత  రేగులపాటి రమ్యారావు కుమారుడు రితీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వంపై వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తనను వేధిస్తున్నారని, చివరికి తన పుట్టినరోజున విద్యార్థి సంఘం నాయకుడుగా ఉన్న తనను ఎవరూ కలవకుండా గృహనిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పుట్టినరోజున గుడికి కూడా వెళ్లనివ్వడంలేదు 


"రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థల వేధింపులతో ఓ విద్యార్థి చనిపోతే వారికి అండగా నిలబడాలని ఎన్.ఎస్.యు.ఐ నేతలు ప్రయత్నిస్తుంటే వారిని ముందు రోజే అరెస్టు చేశారు. ఇవాళ నా పుట్టిన రోజు కనీసం గుడికి కూడా వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారు. పోలీసులు రాత్రి 2 గంటలకు, తెల్లవారుజామున వచ్చి డోర్ కొడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మేమేదో ఉగ్రవాదులు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సీఐకు ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. " -రితేష్ రావు


శ్రీ చైతన్య కాలేజీ అనుమతులు రద్దు చేయాలని ధర్నా 


శ్రీ చైతన్య కాలేజీలో  ప్రిన్సిపాల్, క్యాంపస్ ఇంఛార్జ్, లెక్చరర్ ల ఒత్తిడి కారణంగానే ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంఘం, జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శ్రీ చైతన్య కాలేజీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీలలో ప్రభుత్వ పర్యవేక్షణ లేని కారణంగా  ప్రిన్సిపల్, లెక్చరర్ల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం ముమ్మాటికీ చేతకానిదని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి  స్టేషన్ కు తరలించారు.ఈ ధర్నాలో ఎన్ఎస్.యూఐ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


నార్సింగి కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య


హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్‌ అనే విద్యార్థి తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని.. వివరించారు. పోలీసులు, సాత్విక్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలని టార్చర్


"సాత్విక్ మా ఫ్రెండ్. మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ వాళ్లు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. అది తట్టుకోలేక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి భరించలేక వాడు మాతో కూడా మాట్లాడట్లేదు. దీంతోనే  రాత్రి పదిన్నరకు సూసైడ్ చేసుకున్నాడు." - షణ్ముఖ్, విద్యార్థి