వైనాట్ -175 అంటూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతూనే, తాజాగా ప్రతిపక్షాలను కార్నర్ చేశారు. ప్రతిపక్షాలు కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించగలవా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కేవలం జగన్ ప్రశ్నించి వదిలేస్తే ఓకే, కానీ ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ అదే ప్రశ్న అడిగిస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రతిపక్షాలపై జగన్ ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమవుతోంది.
సింగిల్ గా వస్తారా..
ప్రతిపక్షాల కచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేస్తాయి. పులివెందులలో కూడా అభ్యర్థిని నిలబెడతాయి. కానీ ఇక్కడ జగన్ అడుగుతోంది ఒక్కటే. ప్రతిపక్షాలు విడివిడిగా 175 స్థానాల్లో పోటీ చయగలవా అని అడుగుతున్నారు. అంటే ప్రతిపక్షాలకు విడివిడిగా అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందా అంటూ పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. తెనాలిలో రైతు భరోసా సభ తర్వాత మంత్రి కాకాణి కూడా మీడియా సమావేశంలో ఇదే ప్రశ్న సంధించారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో కూడా 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కి.. మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. టీడీపీ, జనసేనకు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. తమకు పొత్తులు అవసరం లేదని, అప్పుడు సింగిల్ గానే పోటీ చేశామని, ఇప్పుడు కూడా సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పారు. టిడిపి, జనసేన కు ఆ సత్తా ఉందా అని సవాల్ విసిరారు. దమ్ముంటే యువగళం పాదయాత్రలో ఆమేరకు లోకేష్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అనిల్. కనీసం పోటీ చేసే స్థానాల సంఖ్య చెప్పుకోలేని పార్టీలు, సీఎం జగన్ గురించి మాట్లాడతాయా అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు అనిల్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాదే..
పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. టీడీపీ హయాంలో కంటే తమ హయాంలోనే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చామని చెప్పారు మాజీ మంత్రి అనిల్. టీచర్లకు కూడా తమ హయాంలోనే ఎక్కువ బెనిఫిట్స్ లభించాయని చెప్పారు. పట్టభద్రులు, టీచర్లు తమకే మద్దతు తెలపాలన్నారు. సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
టీడీపీ, జనసేనకు సింగిల్ గా పోటీ చేసే సత్తా లేదని అందుకే వారంతా కలసి పోటీ చేయాలనుకుంటున్నారని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. దమ్ముంటే వారు సింగిల్ గా పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యేలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకోవడం ఖాయమన్నారు. పవన్ కల్యాణ్ కి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని చెప్పారు అనిల్. మొత్తమ్మీద ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయాలని అధికార పక్షం కోరుకుంటున్నట్టుంది. అందుకే ఇప్పుడు నేతలు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే విడివిడిగా రండి, పోటీ చేస్తామని ప్రకటించండి అంటున్నారు వైసీపీ నేతలు.