Janasena Advisor Met CM KCR : జనసేన పార్టీ అడ్వైజర్, తమిళనాడు మాజీ సీఎస్, కాపు సమాజం నాయకులు ఆర్. రామ్మోహన్ రావు  బుధవారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఏపీ నాయకుడు పార్థసారథి, ఆర్. రామ్మోహన్ రావులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాంతి కుమారిని  ఈ సందర్భంగా అభినందించారు.


ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ 


ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించిన సీఎం కేసీఆర్ సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఇటీవల స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్  ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సభకు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాటు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని  సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ నేతలు సూచించారు. అయితే జనసేన పార్టీ అడ్వైజర్ గా ఉన్న మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


తెలంగాణకు కొత్త సీఎస్ 


తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు సస్పెన్స్ వీడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిణి శాంతికుమారి నియమితులయ్యారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది.  ఏపీ కేడర్‌కు సోమేష్ కుమార్‌ను మంగళవారం అప్పగించడంతో ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 12వ తేదీలోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ కుమార్‌ ను డీవోపీటీ ఆదేశించింది.  తాజాగా తెలంగాణ సీఎస్‌గా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బీఆర్ కేఆర్ భవన్ లో నూతన సీఎస్‌గా ఆమె భాద్యతలు స్వీకరించారు.






తెలంగాణలో తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి 


అంతకుముందు బుధవారం నాడు సీనియర్ అధికారిణి శాంతికుమారి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆమె 1989 బ్యాచ్ కు చెందిన అధికారిణి. ఆమె ఏప్రిల్‌ 2025 వరకు రాష్ట్ర సీఎస్‌గా కొనసాగనున్నారు. సీనియర్ అధికారిణి శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్యత‌లు నిర్వర్తించారు. గతంలో సీఎం కార్యాలయంలో స్పెష‌ల్ ఛేజింగ్ సెల్ లో సేవలు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపించాయి.