Governor Tamili Sai : తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వివాదం నడుస్తోంది. ఎమ్మెల్సీ సీటు కేటాయింపు, ప్రోటోకాల్ వివాదం, గవర్నర్ దిల్లీ పర్యటన, మంత్రుల విమర్శలు ఇలా వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాలపై గవర్నర్ తమిళి సై మరోసారి స్పందించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సౌమ్యురాలినని, బీజేపీ నేపథ్యం ఉన్నా రాజ్యాంగబద్ధ పదవిలో పార్టీలకు అతీతంగా పనిచేశానని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ బీజేపీ ఆఫీసుగా మారిందన్న టీఆర్ఎస్ ఆరోపణల్లో అర్థంలేదన్నారు. తన పుట్టినరోజు జూన్ 2 నాడే తెలంగాణ కూడా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తో విభేదాల కారణంగా రాష్ట్రం విడిచిపోవాలనే ఆలోచనే లేదని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఇతర అంశాలపై కేంద్రం నుంచి ఏ ఆదేశాలు రాలేదన్నారు. విమర్శలకు తన పని ద్వారానే బదులిస్తానని తమిళిసై వెల్లడించారు. 


ప్రోటోకాల్ పాటించడంలేదు 


కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీ పోస్టు విషయంలో స్పందిస్తూ.. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి సామాజిక సేవల రంగంలో ప్రతిపాదించారు. ప్రతిపాదిత వ్యక్తి ఆ రంగంలో పనిచేశారో లేదో, ఆ పదవికి సరిపోతారో లేదో పరిశీలించే అధికారం తనకు ఉందన్నారు. ఆయన ఆ కేటగిరీకి సరిపోయే వ్యక్తి కాదని వాళ్లకు తెలుసన్నారు. తనకు సీఎంతోగానీ, ప్రభుత్వంతోగానీ ఎలాంటి విభేదాలు లేదన్నారు. ప్రభుత్వం తనకు కనీసం ప్రోటోకాల్ ప్రకారమైనా గౌరవం ఇవ్వడంలేదన్నది వాస్తవమన్నారు. అయితే అందుకు తనకేమీ బాధలేదని గవర్నర్ అన్నారు. మహిళా గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. గతంలో ఏమైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడేదాన్ని అని గవర్నర్ తమిళి సై అన్నారు. ఆయన తనను కలవక ఏడాది కావొస్తుందని తెలిపారు. ఈ మధ్య ఫోన్లు చేసినా లైన్ లోకి రావడంలేదని స్పష్టం చేశారు. అపోహల తొలగిపోవాలంటే కేసీఆర్‌ స్వయంగా వచ్చి కూర్చొని తనతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. తాను రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్నానన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చలోని అంశాలను సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా విచిత్రంగా అనిపించిందన్నారు.


సోషల్ మీడియా ట్రోలింగ్ పై 


 కొంతమంది తెలంగాణ మంత్రులు తనపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని గవర్నర్ తమిళి సై అన్నారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజలకే వదిలేస్తున్నానన్నారు. ఒక మహిళతో ఇలానే వ్యవహరిస్తారా ఇదేనా ఇదేనా తెలంగాణ సంస్కృతి అని గవర్నర్ ప్రశ్నించారు. తాను వృత్తిరీత్యా వైద్యురాలనని బద్ధ శత్రువు వచ్చినా గౌరవించే సంస్కారం తనకు ఉందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్‌ ఇవ్వడంలేదని, కలెక్టర్‌, ఎస్పీ, ఏ అధికారీ రావడంలేదన్నారు.  వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లినా తనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కలేదన్నారు. యాదగిరి గుట్టకు వెళితే ఆలయ ఈవో కూడా రాలేదన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లానన్నారు. సంప్రదాయం ప్రకారం అక్కడికి సీఎం కేసీఆర్‌ రావాల్సి ఉండగా, రాష్ట్ర మంత్రులను మాత్రమే పంపించారు. రాజ్‌భవన్‌లో ఉగాదికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించామన్నారు. అయితే ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే వచ్చారని గవర్నర్ తెలిపారు.   తమిళిసైగా తనను అవమానించినా పర్లేదు కానీ గవర్నర్ స్థానాన్ని అవమానిస్తే సహించనన్నారు. వ్యక్తిగతంగా తనపై రాళ్లు కూడా రువ్వొచ్చు, ఒకవేళ రాళ్లు రువ్వి, రక్తం చిందితే ఆ రక్తంతో చరిత్రను రాస్తానని గవర్నర్ తమిళి సై అన్నారు.