Hyderabad Formula E Racing : హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ వద్ద ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు.  దేశంలోనే మొట్టమొదటిసారిగా  ఫార్ములా-E రేసు హైదరాబాద్ లో జరుగుతోంది. రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దండంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ రేసింగ్ జరగనుంది. 6 బృందాలుగా మొత్తం 24 మంది రేసర్లు ఈ రేసింగ్ పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ లో సగం మంది రేసర్లు మన దేశానికి చెందిన వారుకాగా, మరో సగం మంది విదేశాలకు చెందినవారు. రేసింగ్ పోటీలో  హైదరాబాద్ రేసర్లు కూడా పాల్గొంటున్నారు. ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ , ఐమ్యాక్స్  వరకూ రేస్ సర్య్కూట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా మొదటి సారి రేసింగ్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నారు.  






 దూసుకుపోతున్న కార్లు 


ఈ రేసింగ్ లీగ్ లో 250 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోతున్నాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ సచివాలయం, ప్రసాద్ ఐ మాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం, లుంబినీ పార్క్ మీదుగా తిరిగి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ చేరుకుంటున్నాయి రేసింగ్ కార్లు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కు HMDA పూర్తి ఏర్పాట్లు చేసింది. రేసింగ్ లీగ్ కోసం 2.7 KM స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేసింది. మొత్తం 6 టీమ్ ల మధ్య రేసింగ్ లీగ్ జరుగుతుంది. మొదటి, తుది రేసింగ్ పోటీలకు వేదికగా హైదరాబాద్ ను ఎంపిక చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ను  RPPL సంస్థ నిర్వహిస్తుంది. 


అసలు ఈ ఫార్ములా ఈ రేసు అంటే ఏంటి?


ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ సింగిల్ సీటర్ చాంపియన్‌షిప్. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ అని దీన్ని అధికారికంగా పిలుస్తారు. రేసింగ్‌లను మరింత మెరుగ్గా, కాలుష్యం లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 2014లో బీజింగ్‌లోని ఒలంపిక్ పార్క్‌లో దీనికి సంబంధించిన మొదటి రేసు జరిగింది. అప్పటి నుంచి ఫార్ములా ఈ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా ఎదిగింది. బెస్ట్ రేసింగ్ డ్రైవర్లు, టీమ్స్ ఇందులో ఉన్నారు.


ఫార్ములా ఈ కార్లు ఎలా పని చేస్తాయి?


ఫార్ములా ఈ కార్లలో ఒక ఇన్వర్టర్, మోటార్, ఒక ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. బ్యాటరీ నుంచి తీసుకున్న ఎలక్ట్రిసిటీని ఇన్వర్టర్ డైరెక్ట్ కరెంట్‌ (డీసీ) నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్‌గా (ఏసీ) మారుస్తుంది. దీన్ని ఉపయోగించి మోటార్ చక్రాలను తిప్పుతుంది.


ఫార్ములా ఈ కార్లు ఎంత వేగంగా వెళ్తాయి?


ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ రేసింగ్ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 kW పవర్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే ఇవి అందుకుంటాయి.