CS Somesh Kumar Relieve : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కొనసాగింపు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ(Department of Personnel and Training) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నెల 12వ తేదీలోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్ కుమార్ ను డీవోపీటీ ఆదేశించింది.
హైకోర్టు కీలక తీర్పు
సీఎస్ సోమేశ్ కుమార్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు కారణంగా ఏంచేయాలనే అంశంపై సీఎంతో చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను డీవోపీటీ ఇరు రాష్ట్రాలకు కేటాయించింది. సోమేశ్ కుమార్‌కు ఏపీ కేడర్ కు కేటాయించింది. అయితే ఆయన తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సోమేశ్ కుమార్ సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. క్యాట్ తీర్పుపై కేంద్రం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్లాలని తీర్పు ఇచ్చింది.
డిప్యూటేషన్ పై కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్(IAS) అధికారి సోమేష్ కుమార్ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సీఎస్ సోమేష్ కుమార్ కంటే సమర్థులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్‌పై రప్పించుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్ ఆదేశాలను ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది.
బండి సంజయ్ ఆరోపణలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ను తొలగించి.. రాష్ట్రానికి కేటాయించిన మరో వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజ తర్వాత ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక పదవులు కట్టబెట్టడం అనైతికం, అప్రజాస్వామికం అని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఏరోజు చట్టాలు, రాజ్యాంగం, కేంద్ర నిబంధనలను గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ అవసరాల కోసం అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా.. ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్ ను సీఎస్ గా నియమించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిపొందిందని ఆరోపించారు.