మీ వాహనాలను పోలీస్ కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి. మీరే జాగ్రత్తగా వెళ్లాలి. స్పీడ్ వెళ్తే ఫైన్ లు తప్పవని స్పష్టం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇటీవల పోలీసుల తీరుపై ప్రజలు ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా వాహనదారులు. పోలీసులు ఏ స్పీడ్ గన్ పట్టుకొని ఏ చెట్టు చాటునో, ఏ రోడ్డు పక్కన ఉంటారో తెలియని పరిస్థితి. అది నేషనల్ హైవే కావచ్చు, లోకల్ రోడ్లు కావచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఫ్లై ఒవర్ కావచ్చు. కాదేది ఫైన్ కు అనర్హం అన్నచందంగామారింపోయింది. పోలీసులు మేం స్పీడ్ గన్ లు పెట్టాం అని చెప్పి చేస్తే వాహనదారులు కాస్త జాగ్రత్త పడతారు. కానీ దొంగచాటుగా ఈ స్పీడ్ గన్ లు పెట్టి ఎందుకు ఫైన్లు వేస్తున్నారని నెట్ జన్లు ఈ మధ్య తెగ ట్రోల్ చేస్తున్నారు పోలీసుల తీరును. అయితే డీజీపీ మహేందర్ రెడ్డి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. స్పీడ్ గన్లు ఉంటాయి. కానీ స్పీడ్ లిమిట్ బోర్డులు మాత్రం తొందర్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు పనితీరు, నేరాలపై డీజీపీ వార్షిక నివేదిక విడుదల చేశారు. అసలు ఈ స్పీడ్ గన్ లు ఎందుకు వాహనదారులకు కూడా తెలియకుండా పెట్టాల్సి వచ్చిందంటే. రాష్ట్రంలో వాహనదారులు రోడ్ల మీద ఇష్టమెచ్చిన స్పీడ్ లో వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అన్నారు.
ఇందులో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 19248 రోడ్డు ప్రమాదాలు జరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వీటిలో ఈ రోడ్డు ప్రమాదాల్లో 6746 మరణించారు. స్పీడ్ కంట్రోల్ కాకపోతే ఈ ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. అంతే కాదు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించండలేదని అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఒక కోటి 65 లక్షల ట్రాఫిక్ నిబంధనల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజల్లో ట్రాఫిక్ పట్ల నిబద్ధతలేదు, ఇష్ట వచ్చినట్లు గా వాహనాలు నడవపడం, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించడం వల్ల మిగిలిన వాహనదారులు, సామాన్య జనం ఇబ్బందిపడుతున్నారనే విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హాక్ ఐ ద్వారా ప్రజలే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు 61వేల కు పైగా ఉన్నాయి. ఫైన్ వేయడం పోలీసులు లక్ష్యం కాదనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మహేందర్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ ఛలాన్ల మీద ఈ ఏడాది రాష్ట్ర పోలీసులకు రూ. 612 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
మొత్తం మీద డీజీపీ ప్రెస్ మీట్ లో మీడియా అడిగి ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులు స్పీడ్ గన్ లు పట్టుకొని ఉంటారు. కాకపోతే అక్కడ స్పీడ్ లిమిట్ కు సంబంధించిన సైన్ బోర్డు, స్పీడ్ లిమిట్ ను తెలియజేసే బోర్డులు పెట్టి మరీ చలాన్లు వసూలు చేస్తామని చెప్పకనే చెప్పారు. సో వాహదారులు మాత్రం చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిందే. స్పీడ్ పెంచితే ఫైన్ ఎక్కడ నుంచి ఏ రూపంలో పడుతుందో తెలియదు.