BRS vs Sajjanar: వీసీ సజ్జనార్.. ఈ సీనియర్ IPS అధికారి పేరు తెలంగాణలో చాలా పాపులర్. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ కూడా. ఈ పోస్టులోకి రాకముందు RTC ఎండీగా.. అంతకు ముందు సిటీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఆయన చాలా ప్రాధాన్యత ఉన్న పోస్టులలో పనిచేశారు. అంతే కాదు.. అనేక సందర్భాల్లో తన డైనమిజం, పోలీసు యాక్షన్, కామెంట్స్ ద్వారా సజ్జనార్ వార్తల్లో నిలిచారు. అయితే ఈ మధ్య కాలంలో సజ్జనార్ పేరు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఆయన పేరు ఎక్కువుగా జపిస్తోంది. “పోలీస్ కమిషనర్  సజ్జనార్... కాంగ్రెస్  కండువా కప్పుకున్న కార్యకర్త”  అనే స్థాయి వరకూ ఆరోపణలు వెళ్లాయి. బీఆఎస్ సీనియర్ నేత.. హరీష్‌రావు నేరుగానే ఈ మాట అనేశారు. ఆ తర్వాత వారం తిరక్కముందే హరీష్‌రావుకు ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయి. ఈ ట్యాపింగ్ కేసుపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SITకు చీఫ్‌కూడా సజ్జనారే.  విచారణకు హాజరైన హరీష్‌ ఆ తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. దానికి సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వివాదం పెరుగుతూనే ఉంది.  

Continues below advertisement

 BRS ఎందుకు ఆయనపై ‘కాంగ్రెస్ పోలీస్’ అన్న ముద్ర వేస్తోంది?

 సాధారణంగా పోలీస్ కమిషనర్ పదవి లా అండ్ ఆర్డర్ వరకు పరిమితమై ఉంటుంది. కానీ ఇటీవలి నెలల్లో సజ్జనార్ పేరు రాజకీయ హెడ్‌లైన్లో కనిపించడం మొదలైంది. ఆయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఒక్కటే కాదు. కిందటి డిసెంబర్‌లో  ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ – SIT కు చీఫ్‌గా సజ్జనార్‌ రావడం ప్రధానమైన విషయం. సిట్‌ చీఫ్‌గా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నాక దర్యాప్తు వేగం పెరిగింది. ఇది ప్రధానంగా బీఆర్‌ఎస్ పార్టీపైన ఫోకస్ అయిన కేసు. అదే సమయంలో తెలంగాణలో మరో కేసులో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం.. దానిని బీఆర్‌ఎస్ డిఫెండ్ చేయడంతో పోలీసులకు.. ఆ పార్టీకి మధ్య వార్ నడిచింది.  జర్నలిస్టుల అరెస్ట్ సమయంలో సీపీ.. కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి.. “ఎమర్జెన్సీ ఉంటే మీరంతా జైలులో ఉండేవారు” అని వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ పెంచింది. ఆ సందర్భంగానే హరీష్ రావు.. సజ్జనార్‌ను .. “కాంగ్రెస్ కండువా కప్పుకోరాదు” అని విమర్శించారు.

Continues below advertisement

వివాదానికి కేంద్ర బిందువు ఫోన్ ట్యాపింగ్ కేసు

బీఆర్‌ఎస్ నేతలు సజ్జనార్‌పై దృష్టి పెట్టడానికి దారితీసిన పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ కేసు. కిందటి BRS ప్రభుత్వ హయాంలో కొంతమంది వ్యాపారులు, రాజకీయ నాయకులు,అధికారులపై  అక్రమ నిఘా జరిగిందనే ఆరోపణలపై ఈ కేసు కిందటి ఏడాది నమోదైంది.  ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించిందన్న  విషయాన్ని బయట పెట్టింది. కొంతమందిని అదుపులోకి తీసుకుని చార్జ్‌షీట్లు వేసినా ఈ కేసు ఓ కొలిక్కి రాలేదన్న అభిప్రాయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కిందటి డిసెంబర్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో SIT ఏర్పాటైంది. అప్పటి వరకూ ఈ కేసులో పొలిటికల్ ఆరోపణలున్నాయి కానీ.. రాజకీయ నాయకులను పిలిచి విచారించిన పరిస్థితి లేదు. బాధితులను విచారించారు కానీ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను విచారించలేదు. ఈ కేసులో మొదటి సారిగా  హరీష్‌రావును పిలవడంతో అది సజ్జనార్ VS హరీష్‌ అనే స్థాయికి వెళ్లిపోయింది.

హరీష్‌కు నోటీసులు- ఈ టైమింగ్‌ను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్

పోలీసు విచారణకు.. పోలిటికల్ పరిణామాలకు టెక్నికల్‌గా ముడిపెట్టకూడదు కానీ.. హరీష్‌ రావును విచారణకు పిలిపించిన టైమింగ్ మాత్రం యాధృచ్చికం కాదు అనే BRS వాదనను బలపరుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పటి నుంచీ.. ఇది హరీష్‌రావు నేతృత్వంలో జరిగిందనే నేరేటివ్ పోలీసు లీకుల ద్వారా బయటకు వచ్చింది. ఆయనను జనవరి 20, మంగళవారం నాడు సిట్ విచారణకు పిలువక ముందే ఈ ప్రచారం బిల్డప్ అయింది. ఈ కేసు విషయంలో పొలిటికల్ కదలిక వస్తే.. హరీష్‌ను విచారణకు పిలుస్తారన్న విషయం అందరికీ అవగాహన ఉంది. అయితే ఆయన్ను పిలిచిన సమయాన్ని BRS ప్రశ్నిస్తోంది. హరీష్‌రావుకు నోటీసులు వచ్చిన రోజే ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది కి లబ్ది చేకూరేలా సింగరేణి స్కామ్ జరిగిందని ప్రశ్నించారు. అంతకు ముందు జరిగిన జర్నిలిస్టుల అరెస్టుకు.. ఉపముఖ్యమంత్రి భట్టిపై  వచ్చిన ఆరోపణలతో అప్పటికే హీట్ పెరిగిన ఈ విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కుటుంబానికే సంబంధం ఉందని... హరీష్ బాంబు పేల్చారు.  ఆ సాయంత్రమే ఆయనకు నోటీసులు వచ్చాయి. ఇది కచ్చితంగా రాజకీయ కుట్రపూరితం అని BRS ఆరోపించింది. విచారణకు హాజరైన తర్వాత  హరీష్ మాట్లాడుతూ  విచారణాధికారి ఈ కేసులో తనను ఏమీ విచారించలేదని.. అరగంటకోసారి బయటకు వెళ్లి ఫోన్లు చేశారని... "సజ్జనార్‌తోనో.. లేక సీఎంతోనో మాట్లాడారని" కామెంట్‌ చేశారు. కచ్చితంగా సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే తనకు నోటీసులు ఇచ్చారన్నారు.  

సజ్జనార్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్

ఈ విషయంలో హరీషే కాదు.. మరో సీనియర్ నేత KTR కూడా పోలీసులపై తీవ్రమైన కామెంట్లు చేశారు. "ఇప్పుడు అతిగా ఆవేశపడే పోలీసులు రెండేళ్ల తర్వాత BRS ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు?" అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. “రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు కచ్చితంగా భవిష్యత్తులో బలి అవుతారు.” అని హెచ్చరికలు చేశారు. రిటైర్ అయినా కూడా ఇప్పుడు రెచ్చిపోయే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు చెప్పడం ద్వారా పోలీసులకు ఓ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా.. “ ‘ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపల ఉండేవారు’ అంటూ ఎక్కువ మాట్లాడుతున్న అధికారులు కూడా గుర్తుంచుకోవాలి” అని ప్రత్యేకంగా చెప్పడం అది సజ్జనార్‌ను ఉద్దేశించిందే అని అర్థమవుతోంది.

వెనక్కు తగ్గని సజ్జనార్:

సహజంగానే డైనమిక్‌గా ఉండే  సజ్జనార్‌ కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. జర్నలిస్టుల అరెస్టు సమయంలో ‘ఎమర్జెన్సీనా’  అని ప్రశ్నించిన ఆయన  హరీష్‌రావును కూడా వదల్లేదు. విచారణ తర్వాత హరీష్‌రావు చేసిన కామెంట్లకు కొద్ది సేపట్లోనే పోలీసు శాఖ నుంచి కౌంటర్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై సుప్రీంకోర్టు  ఆదేశాలున్నా.. తనను విచారణకు పిలిచారని హరీష్‌ చెప్పడంపై.. అది నిజంకాదని.. ఆ విషయాన్ని “ప్రజలు నమ్మొద్దు” అంటూ సజ్జనార్ నోట్ పంపారు. సాధారణంగా రాజకీయ నాయకులు పొలీసు విచారణపై రాజకీయ ఆరోపణలు చేస్తే.. పోలీసులు స్పందించరు. కానీ సజ్జనార్ .. హరీష్‌ ప్రెస్‌మీట్ పెట్టిన కొద్దిసేపట్లోనే రియాక్ట్ అయి ప్రెస్‌నోట్ పంపారు. ఇది కూడా బీఆర్‌ఎస్ -హైదరాబాద్‌ సీపీల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో చాటుతోంది.

 అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంది.. హరీష్‌రావుపై వ్యక్తిగతంగా నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపైన మాత్రమే అని.. ఈ కేసు పూర్తిగా వేరు అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. అసలు హరీష్‌ రావు ఫోనే ట్యాపింగ్ అయిందన్న విషయాన్ని ఆయనకు చెప్పినట్లుగా పోలీసు లీకులు వచ్చాయి. వాస్తవానికి విచారణలో ఏం జరిగిందో తెలీదు కానీ..BRS శ్రేణులను గందరగోళానికి గురి చేసే విధంగా పోలీసులు లీకులు ఇస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. “ఈ కేసులో రెండేళ్లు నుంచి అన్నీ లీకులే ఉన్నాయి తప్ప.. ఒక్కటి కూడా అధికారిక ప్రకటన లేదు. అధికార పార్టీకి చెందిన పొలిటికల్ నేరేటివ్‌ను బలపరిచేలా పోలీసులు లీకులు చేస్తూ.. వారికి సహకరిస్తున్నారని” KTR కూడా ఆరోపించారు.

మరి కాంగ్రెస్‌పై కేసులు ఏవీ..? ఖాకీబుక్‌ లో నోట్ చేయడం లేదా..?

మీడియాపై కేసుల విషయంలో క్షణాల్లోనే SIT ఏర్పాటు చేసిన సజ్జనార్.. కాంగ్రెస్ నాయకులు అరాచకాలపై చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ ప్రశిస్తోంది. మంత్రి పొంగులేటి కుమారుడిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు కానీ.. కాంగ్రెస్ నాయకుడు సంపత్‌కుమార్ తనను 8కోట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారంటూ ... నేరుగా కాంట్రాక్టర్ పోలీసు స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినా... రేవంత్ రెడ్డి సహచరుడు రోహిన్‌రెడ్డి గన్ పెట్టి బెదిరించారంటూ.. మంత్రి కూతురు బహిరంగంగా చెప్పినా నో పోలీస్ యాక్షన్ అని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అర్థరాత్రి జర్నలిస్టులు ఇంటి మీదకు వెళ్లిన పోలీసులు.. మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై అవమానకర రీతిలో మహిళల గురించి మాట్లాడితే ఎందుకు చర్యలు లేవని బీఆర్‌ఎస్ అంటోంది.

సజ్జనార్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు.?

వీ.సీ సజ్జనార్ తెలంగాణలో చాలా ఏళ్లుగా పాపులర్. YS రాజశేఖరరెడ్డి హయాంలో అమ్మాయిల మీద యాసిడ్ పోసీన ఇద్దరు నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం అయిన దిశ ఎన్‌కౌంటర్‌ లో ఎగ్దిక్యూటివ్‌ రోల్‌లో సజ్జనారే ఉన్నారు. ఈ రెండు ఘటనలతో పాజిటివ్‌గా.. నెగటివ్‌గానూ ఆయన బాగా పాపులర్ అయ్యారు. RTC ఎండీగానూ సజ్జనార్ చాలా యాక్టివ్ రోల్ పోషించారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ నేత జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఆ పార్టీతో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌ సీపీగా ఆయన దూకుడు, చేసిన కామెంట్స్ వంటివి ఆ పార్టీతో మరింత దూరాన్ని పెంచాయి.  “పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా? లేక రాజకీయ వ్యవస్థల నీడలోనా?” ప్రస్తుతం సజ్జనార్ ఈ ప్రశ్నల మధ్యలో ఉన్నారు. ఆయన నిజంగా రాజకీయ ఆదేశాలతో పనిచేస్తున్నారా? లేక ఆయనపై రాజకీయ ముద్ర వేయడం మాత్రమే జరుగుతుందా? — దీనికి తుది సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: తెలంగాణలో అధికార మార్పు తర్వాత మొదలైన ఈ దర్యాప్తులు, వాటిపై సాగుతున్న రాజకీయ యుద్ధం — రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రాజకీయ ఘర్షణలకు బీజం వేస్తోంది.