Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటే అని, ఓట్ల రాజకీయం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... గతంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను ఎన్నోసార్లు అవమానించిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా ఎవరి ఊహలకు అందని విధంగా గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో అమిత్ షా పాచిక నడిచిందని అన్నారు మహేష్ కుమార్. అవమానపడిన గవర్నర్ బాధను దిగమింగుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ... ప్రసంగించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీజేపీ, బీఆర్ఎస్ వేరు అనే విధంగా డ్రామాలు ఆడుతున్నారని మహేష్ అన్నారు.
కాలోజీ కలలకు తూట్లు
ప్రజా కవి కాలోజీ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిదని అన్నారని మహేశ్ కుమార్ గుర్తుచేశారు. కానీ తెలంగాణలో పుట్టుక మనది, చావు మనది, బ్రతుకంతా బీజేపీ, బీఆర్ఎస్ దని, కాలోజీ కన్న కలలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ గడీల పాలనలో బందీ అయిందని ఆరోపిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగిస్తూ తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని అన్నారని, తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేవని అన్నారు మహేష్ కుమార్. భూమి దోపిడికి గురవుతుందని, మూడు ఎకరాల భూమి రాలేదన్నారు. ఉద్యోగాలు లేవు, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు, విద్య ,వైద్యానికి నిధులు లేవు, సర్పంచులకు జీతాలు లేవు ఇటువంటి తెలంగాణను గవర్నర్ బంగారు తెలంగాణ అని ప్రసంగించడం హాస్యస్పదంగా ఉందన్నారు.
కొత్త సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు
కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపెట్టిందని, గిరిజనులకు 12% రిజర్వేషన్ లేదని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ లేదని, తెలంగాణకు రూ.41,000 కోట్లు రావాల్సి ఉండగా రూ.7,700 కోట్లు గ్రాంటినైడ్ వచ్చిందని మహేశ్ కుమార్ అన్నారు. కేంద్రం పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ లో 72 శాతం వస్తే తెలంగాణకు 67% మాత్రమే వచ్చిందని, తొమ్మిది ఏళ్లలో తెలంగాణ అప్పులు మాత్రమే సంపాదించిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటాయని అన్నారు మహేష్. వినియోగంలో ఉన్న సెక్రటేరియట్ వాస్తు పేరు చెప్పి కూల్చేశారని, అగ్ని ప్రమాదం జరిగితే వాహనాలు తిరగడానికి లేదని నేపంతో సచివాలయాన్ని కూల్చివేసి కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నారని, కొత్త సెక్రెటరీ నిర్మిస్తే అందులో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. లోపం ఎక్కడ జరిగిందో దర్యాప్తు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ డైరెక్షన్ లో గవర్నర్ ప్రసంగం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గవర్నర్ ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బయట పులిలా గర్జించిన గవర్నర్, అసెంబ్లీలో పిల్లిలా మారిపోయారని ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడారన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు అంతే అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో గవర్నర్ ప్రసంగం నడిచిందన్నారు. తప్పని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందన్నారు.