Revanth Reddy On KCR : తెలంగాణలో శాంతి భద్రతలు లోపించాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. అడుగడుగునా అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మహిళలకు భద్రత ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే అత్యాచారాలు చేస్తున్నారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ మైనర్ అత్యాచారంపై ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఈ రోజుకీ ముఖ్యమంత్రి కేసీఆర్ మైనర్ అత్యాచార ఘటనపై నోరు మెదపలేదన్నారు. అత్యాచారాలు కూడా టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పంచుకుంటున్నాయని విమర్శించారు. ఎలాంటి నేరాలు, ఘోరాలు చేసినా శిక్షలు మాఫీ అన్నట్లు అసదుద్దీన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం నేతలు అత్యాచారం చేస్తే ఎందుకు శిక్షించడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ బచావో నినాదంతో నగరంలోని శాంతి భద్రతలపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ కు వీఆర్ఎస్
కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదు. ఇతర రాష్ట్రాలలో కలిసివచ్చిన నేతలు కేసీఆర్ ను జోకర్ గా చూస్తున్నారు. దేశ రాజకీయాలపై కేసీఆర్ కు మక్కువ ఉంటే, నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? అక్కడ అభ్యర్థిని నిలబెట్టి, ప్రచారం చేయండి. రాష్ర్టపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారు. కేసీఆర్ వ్యవహారం అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంలా ఉంది. బ్రహ్మానందం రేడియేటర్ సినిమాలా ఉంది కేసీఆర్ పరిస్థితి. కొంత కాలానికి ప్రజలే టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారు. గజ్వేల్ ఫాంహౌసే కేసీఆర్ కు ప్రపంచం అవుతోంది. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కేసీఆర్ మాటలు చిత్తు కాగితాలు
దేశంలో కాంగ్రెస్ లేదంటున్న సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదిమంది ఎంపీలు లేని టీఆర్ఎస్ కాంగ్రెస్ లేదంటే అయిపొద్దా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా పోటీ చేయాల్సింది తెలంగాణలోనే కదా అన్నారు. కేసీఆర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చేప్తారన్నారు. అలాంటివి సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని రేవంత్ అన్నారు. ఎన్టీఆర్ ను గతంలో తిట్టింది కేసీఆర్ యేనని ఇప్పుడు పొగుడుతుంది కేసీఆర్ యే అని తెలిపారు. కేసీఆర్ మాటలు చిత్తు కాగితంతో సమానమని మండిపడ్డారు.
Also Read : KTR In Khammam : కులం, మతం పేరుతో రాజకీయ చిచ్చు - యువత ఆలోచించాలని కేటీఆర్ సలహా !