Karate Kalyani Notice : చిన్నారి దత్తత విషయంలో సినీ నటి కరాటే కళ్యాణికి మరోసారి నోటీసు జారీ చేస్తామని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. ఇప్పటికే ఒకసారి అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నారు. మరోసారి నోటీస్ జారీ చేస్తామని, తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు కొన్ని నియమాలు ఉంటాయని దాని ప్రకారమే దత్తత తీసుకోవాలన్నారు. ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటే కుదరదని కలెక్టర్ శర్మన్ తెలిపారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. 


కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు 


నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ గొడవ పెద్ద రచ్చ అయిందో తెలిసిందే. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ వివాదం ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే ఇరువురిపై ఒకేరకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ సైదులుపై కళ్యాణి ఫైర్‌ అయింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచింది. 






ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేశారు. తనిఖీలు నిర్వహించి అధికారులు కరాటే కళ్యాణ్ ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు? ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కళ్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయని అధికారులు అంటున్నారు. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు కరాటే కళ్యాణితో పాటు చిన్నారి కూడా ఉన్న సంగతి తెలిసిందే.