CM KCR On Rains : తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యలపై సీఎం కేసీఆర్ అదేశాలిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వరద పరిస్థితులను స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అవుతోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షపాతం లెక్కల్ని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రామంతపూర్ పరిధిలో 3.5 మి.మీ, బండ్లగూడలో 3.3 మి.మీ, హయత్ నగర్ లో 2.8 మి.మీ, బన్సిలాల్ పేట్ లో 2.8 మి.మీ, సీతాఫల్ మండి బస్తీ 2.3 మి.మీ, ముషీరాబాద్ 2.0 మి.మీ, నాచారం వార్డు ఆఫీస్ 2.0 మి.మీ వర్షపాతం నమోదు అయింది. అయితే హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది.
అధికార యంత్రాంగం అప్రమత్తం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్ అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వరద నీటితో నిండిపోయినా ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అధికారులతో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్ అలర్ట్ కింద ఉందని, ప్రజలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.