CM KCR On Paddy Procurement : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.  ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు(సోమవారం) ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటిని ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు 


సీఎస్ కలెక్టర్లతో మీటింగ్ 


యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సీజన్‌లో 7 వేల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సీఎస్ అధికారులకు ధాన్యం కొనుగోళ్లను తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేయనున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుంది. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే నేరుగా జమచేస్తున్నారు. ఈ ఏడాది గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ వరి రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం నిర్ణయించింది.  






ఇటీవలె మంత్రి గంగుల సమీక్ష  


కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి సీజన్‌ మాదిరి ఈ యాసంగిలో కూడా ధాన్యం సేకరిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను గుర్తించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు "ఎఫ్‌ఏక్యూ" నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అధికారులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రతి ఏటా యాసంగి వరి ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 672 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి గంగుల తెలిపారు. కరోనా సంక్షోభంలో కూడా 92 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా, అలసత్వం ప్రదర్శించినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.