CM KCR : ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుంచే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆదేశించారు.
ఖమ్మం రూట్ లో
‘‘గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూర్ వెళ్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో రోడ్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి ఉంది.? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి ఉన్నాయి? కమ్యునిటీ హాల్స్, డంప్ యార్డులు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నింటి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్ లో మొత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనా వేసి మోడ్రన్ దోభీఘాట్లను సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగుపరచాలన్నారు. తాను చిన్నప్పుడు తిలక్ గార్డెన్ లో వెళ్లి కూర్చేనే వాడినని సీఎం గుర్తుచేసుకున్నారు. తిలక్ గార్డెన్ ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకరించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.
నగర సుందరీకరణ
నిజామాబాద్ నగరంలో మొత్తం ఉన్న ప్రభుత్వ భూములెన్ని వాటిల్లో ప్రజావసరాల కోసం వినియోగించుకోడానికి ఎన్ని అనువుగా ఉన్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖల కార్యాలయాలను ఖాళీ అయ్యాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది..వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సీఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు.
రెండు నెలల్లో వస్తా
‘‘ నేను రెండు నెలల్లో నిజామాబాద్ వస్తా. మీరు చేసిన పనులను పరిశీలిస్తా. అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎంకు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎంను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సీఎంకు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సీఎంను కోరారు.