CM KCR : తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ సంస్థకు చెందిన రెండు నానో శాటిలైట్స్ శనివారం శ్రీహరికోట నుంచి అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ- సీ54 తో పాటుగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ స్పేస్ టెక్ కు చెందిన ‘‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’’ అనే రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం అంకుర సంస్థల చరిత్రలో నిలిచిపోతుందని సీఎం అన్నారు. ప్రైవేట్ రంగం ద్వారా ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అన్నారు. టీ హబ్ సభ్య సంస్థ అయిన స్కైరూట్ స్టాటప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన విక్రమ్ –ఎస్ సాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టాటప్ కంపెనీ మొట్టమొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సీఎం అన్నారు. ఈ ప్రయోగాలతో భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సీఎం అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి “విక్రమ్ ఎస్” , ‘‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’’ ప్రయోగాలు శుభారంభం చేశాయని సీఎం అన్నారు. ఈ రెండు ఉపగ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయన్నారు.
అంతరిక్షం వరకూ తెలంగాణ కీర్తి
ఈ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్ విశిష్టత రెట్టింపు అయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రమలు,శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీ హబ్ లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయనే నమ్మకం తనకుందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీ హబ్ ప్రోత్సాహంతో, తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ ‘ధృవ’ స్పేస్ స్టాటప్ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించాలని కోరారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు వారి అద్భుతమైన ఆలోచనకు తమ అంకుర సంస్థల ద్వారా కార్య రూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. శాస్త్ర సాంకేతిక ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు, టీ హబ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
హైదరాబాద్ స్టార్టప్ సంస్థలు
‘‘ స్కైరూట్ ఎరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’’ అనే అంకుర సంస్థ, దేశంలో మొట్టమొదటిసారి రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రైవేట్ రాకెట్ ‘‘ విక్రమ్ – ఎస్’’ ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. ఇది తెలంగాణ హార్డ్ వేర్ ఇంకుబేటర్ టీ వర్క్స్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకంతో అభివృద్ది చెందిన టీ హబ్ స్టార్టప్ సంస్థ. మొన్నటి ప్రయోగం విజయవంతం కావడాన్ని దేశమంతా చర్చించుకుంటుండగానే ఇవాళ హైదరాబాద్ కు చెందిన మరో స్టాటప్ కంపెనీ అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చేసింది. శనివారం శ్రీహరి కోటనుంచి ధృవ స్పేస్ సంస్థ పంపిన మరో రెండు శాటిలైట్లు విజయవంతం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్టార్టప్ కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి.