CM KCR : హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేడ్కర్ విశ్వమానవుడు, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైందన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి పరిమితమైనవి కావన్నారు. అంబేడ్కర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం అనికొనియాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతోందన్నారు.
అంబేడ్కర్ పేరిట అవార్డు
తెలంగాణ నూతన సచివాయలానికి అంబేడ్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి రోజు సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలని కోరారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలన్నారు. ఇది విగ్రహం కాదని, విప్లవమన్నారు. ఈ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదని, తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ పేరిట ఒక శాశ్వతమైన అవార్డు నెలకొల్పి, దేశంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఇస్తామన్నారు.ఈ అవార్డు పేరిట రూ.51 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చిన రూ.3 కోట్ల వడ్డీతో...దేశంలో ఉత్తమ సేవలందించిన వారికి అంబేడ్కర్ జయంతి రోజున అవార్డులు అందజేస్తామన్నారు. రూ. 51 కోట్లతో శాశ్వత నిధి ఉంటుందన్నారు.
ప్రజలు గెలిచే రాజకీయం రావాలి
నేటికీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుపేదలు ఎవరంటే దళితులు అనే మాట వినబడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రజలు గెలిచే రాజకీయం రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు 10 ఏళ్లు వేరే పార్టీ ఉందని, దళితుల అభివృద్ధి కోసం కేవలం రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం రూ.లక్షా 25 వేల 68 కోట్లు ఖర్చుచేసిందన్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధును అమలుచేస్తామన్నారు. అంబేడ్కర్ కలలు సాకారం కావాలని, తప్పకుండా ఆ రోజు వస్తుందన్నారు. తెలంగాణలో 50 వేల మందికి దళిత బంధు సాయం అందిందన్నారు. ఈ ఏడాదిలో లక్ష పాతిక వేల మందికి దళిత బంధు అందబోతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని తెలంగాణలో తీర్చిదిద్దినందుకు, ఈ అవకాశం తనకు కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని కేసీఆర్ అన్నారు. అంబేడ్కర్ బాటలో దేశాన్ని నడిపేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తానన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
"2014కు ముందు పదేళ్లు పాలించిన ప్రభుత్వం దళితుల కోసం 16 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ పదేళ్ళలో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాలో వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం రాగానే దేశంలో 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. మహారాష్ట్రలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రభంజనం యూపీ, బెంగాల్, ఒడిశాలో రాబోతోంది. ఈ ఏడాది 1 లక్ష 25 వేల మందికి దళితబంధు ఇవ్వబోతున్నాం. దేశంలో మనం రావాలంటే చీలిపోకుండా కలిసి పోరాటం చేయాలి"- సీఎం కేసీఆర్