Vikas Raj: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి- సీఈవో వికాస్ రాజ్

Vikas Raj: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.  

Continues below advertisement

Vikas Raj: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం-2023 లో భాగంగా ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆయా తేదీల్లో సంబంధిత అధికారులు కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సూపర్ వైజర్లు.. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని కార్యక్రమ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతి పోలింగ్ కేంద్రము వద్ద ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Continues below advertisement

 

ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో సంబంధిత ఓటరు జాబితాను ప్రజల సమక్షంలో ఉంచాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించారు. పేరు, ఇంటి పేరు, వయసు, చిరునామా, ఫోటో సవరణలు, మరణించిన ఓటర్ల వివరాల తొలగించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన జాబితా రూపొందించాలని తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ వరకు ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు బూత్ స్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గోడ ప్రతులు, కరపత్రాలు, ఆటోలలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో జిల్లాలోని వారసంతలలో కళాజాతలు ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దారులు, సూపర్ వైజర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. జిల్లాలోని తహసీల్దార్లు, సూపర్ వైజర్లు వారి పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని, సంబంధిత నివేదికను అందించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని, సవరణలు, నూతనంగా ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. అనంతరం ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సిర్పూర్ నియోజకవర్గ మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లాలోని మండలాల తహసీల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Continues below advertisement