Niranjan Jyoti : ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఉన్న జనాన్ని చూస్తే ప్రయాగ్ రాజ్ సంగమంలో జనంలా అనుభూతి కలుగుతోందని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. హైదరాబాద్ కు గతంలో ఒక హిందూ సభకు వచ్చానన్న ఆమె, 2 నెలల క్రితం తిరంగా ర్యాలీలో కూడా హైదరాబాద్ లో పాల్గొన్నానన్నారు. హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఓవైసీ లాంటి వారు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని గుర్తుచేశారు. తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామన్నారు.  దేశంలో మోదీకి వ్యతిరేకంగా దుష్ట శక్తులు ఏకం అయ్యాయని, ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 


బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు 


"2014కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే, హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పేదలకు తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా?. పేదల కోసం తెలంగాణకు మోదీ ప్రభుత్వం 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలి. 15వ ఆర్థికసంఘం నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లిస్తోంది. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్తే, ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తాం. బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. బీజేపీ ముస్లిం వ్యతిరేకే అయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూను చేసేదా?:"- సాధ్వి నిరంజన్ జ్యోతి 


రాహుల్ కు చివరి యాత్ర 
 
కరోనా సమయంలో 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని విమర్శించారు. ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందన్నారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ల అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అన్నారు. రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని ప్రశ్నించారు. మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత  పాలన అందిస్తోందని తెలిపారు. "తెలంగాణ విమోచన దినోత్సవం" ను ఎంఐఎంకు భయపడే 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' నిర్వహించిందన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ప్రశ్నించారు.