Kishan Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వానికి 12 లేఖలు రాశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక్క లేఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే లేఖలపై స్పందించి ఉండేవారన్నారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు సహకరించాలని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనిక స్కూల్‌, సైన్స్‌ సిటీ కోసం భూమి కేటాయించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  


ఓల్డ్ సిటీకి మెట్రో పొడిగించాలని కోరాం 


"పలు అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ కు లేఖలు రాశాను. కానీ స్పందనలేదు. ప్రధాని మోదీ మాకు రూల్ పెట్టారు. ఎవరు ఏ సమస్యపై లేఖ రాసినా దానికి ప్రతిస్పందనగా లేఖ రాయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా మేం లేఖ రాస్తుంటాం. ప్రజాప్రతినిధులు రాసిన లేఖలకు సమీక్ష కూడా నిర్వహిస్తుంటాం. మేం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాసినా ఒక్క దానికి కూడా రిప్లై లేదు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకువస్తానంటున్న కేసీఆర్ రాష్ట్రాభివృద్ధిపై స్పందిస్తున్న తీరు ఇలా ఉంది. హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేయాలని అందుకు డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఒక కోటి రూపాయలు కూడా కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ల్యాండ్ కేటాయించలేదు. మెట్రో పనుల విషయంలో కూడా ఉత్తరాలు రాశారు. కేంద్ర ప్రభుత్వం రూ.1250 కోట్లు నిధులు ఇచ్చింది. మెట్రో రైలును ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు పొడిగించాలని డీపీఆర్ సిద్ధమైంది. కేంద్రం, రాష్ట్రం, ఎల్ అండ్ టీ మధ్య ఓ ఒప్పందం కూడా జరిగింది. ఈ మేరకు నిధులు కూడా మంజూరు చేసింది కేంద్రం. తీరా ప్రాజెక్టు మంజూరు అయిన తర్వాత కేసీఆర్ మెట్రో ప్రాజెక్టును అడ్డుకున్నారు. కేసీఆర్ కారణంగా ఎల్ అండ్ టీపై రూ.3000 కోట్లు అదనపు భారం పడింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. మజ్లిస్ పార్టీ ఆస్తులు పోతున్నాయన్న కారణంగా మెట్రోను అఫ్జల్ గంజ్ లో నిలిపివేశారు. ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకెళ్లాలని నేను చాలా సార్లు కోరారు. ఈ మేరకు తాజాగా ఉత్తరం రాస్తున్నాను. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించాలని కోరాం. " - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 






బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం 


 పెండింగ్ ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడంలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. పైగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత విద్యార్థుల జాబితా కేంద్రానికి ఇవ్వకపోవడంతో ఈ విద్యాసంవత్సరం వాళ్లకు ఇచ్చే స్కాలర్‌ షిప్స్‌ అందకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కొనసాగితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.