Case registered against Malla Reddy :  మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయనపై వారానికో కబ్జా కేసు నమోదు అవుతోంది. తాజాగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై మరో కేసు నమోదయింది. తమకు ఉన్న 
32గుంట‌ల భూమి క‌బ్జా చేసి, అందులో త‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేశార‌ని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు  మ‌ల్లారెడ్డితో పాటు ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డిపైనా ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.  


శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూమి ఉంది. ఆ భూమి తమదేనంటూ మల్లారెడ్డి కబ్జా చేశారు. ఈ భూ వివాదం కోర్టుకు వెళ్లింది.   కోర్టు కేసులు, ఆదేశాలు ఉన్నప్పటికీ.. 32 గుంటలకుపైగా ఆక్రమించుకున్నారు. ఈ భూమి విషయంలో ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు..ఇతరులు వేసుకున్న ఫెన్సింగ్ తీసేసి హంగామా చేశారు. వివాదంపై అధికారులు సర్వే చేశారు.  డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందని తేల్చారు. అధికారులు జూన్ 13న  హైకోర్టుకు నివేదిక అందించారు. సర్వే రిపోర్ట్‌‌ను కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. దీంతో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు.


సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి అంటున్నారు.  అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని పదిహేను మంది వ్యక్తులు ఫెన్సింగ్  వేసుకున్నారు. ఈ ఫెన్సింగ్‌ను మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో వచ్చి మే 19వ తేదీన తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.                                       


ఈ భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూా ఉన్నారు. భూమి తమదే అంటున్న పదిహేను మందిలో ఆయన కూడా ఒకరు.   గతంలోనే  సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని..  తనకు సర్వే అవసరంలేదని చెప్పారని ఆయన ఆరోపించారు.  82/e సర్వే నెంబర్‌లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్‌ వేసినా దానికి కౌంటర్ వేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పినా . కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని ఆరోపించారు.   తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు . ఈ వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వే చేయించింది.   మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిల సమక్షంలోనే సర్వే చేశారు.