ED Seeks Details Of Sheep Scheme: గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు అధికారులు అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఈడీ జోక్యంతో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి నెలకొంది. 


ఈడీ కేసు నమోదు చేసి 24 గంటలు కాకముందే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో కేంద్రంగా మారిన పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులకు లేఖ రాసిన ఈడీ అధికారులు... పలు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. 


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. అవినీతి నిరోధక శాఖను రంగప్రవేశంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెయ్యికోట్లకుపైగా అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆరుగురు అధికారులను అరెస్టు చేశారు. 


ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఇందులో మనీలాండరింగ్ జరిగినట్టు నిర్దారించుకున్న తర్వాత ఈడీ జోక్యం చేసుకొని కేసు నమోదు చేసింది. దీంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.