Renuka Chowdhury : కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. రేణుకా చౌదరి ఎస్సై చొక్కా పట్టుకున్నారు. బాధిత ఎస్సై ఫిర్యాదు మేరకు ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల రాజ్ భవన్ ముట్టడిలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవడంపై ఆమెపై కేసు నమోదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఉపేంద్ర ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హంగామా సృష్టించారు. కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్‌వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు. మహిళా పోలీసులు ఆమెను చుట్టు ముట్టి ముందుకు పోనీయకుండా చేశారు. దీంతో ఆమె ఒక్క సారిగా శివాలెత్తిపోయారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ఒక్క సారిగా మోచేత్తో పొడిచారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎస్‌ఐ చొక్కా కూడా పట్టుకున్నారు. ఓ వైపు ఇతర నేతలు రాజ్ భవన్ వైపు దూసుకెళ్తూంటే.. రేణుకా చౌదరిని కంట్రోల్ చేయాడానికి మహిళా పోలీసులు తంటాలు పడాల్సి వస్తోంది. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తూంటే.. పోలీసులు కుట్ర పూరితంగా ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. అతి కష్టం మీద రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
రణరంగమైన రాజ్ భవన్ ముట్టడి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఫ్యామిలీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ర్యాలీలు నిరసనలను కాంగ్రెస్ చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన అగ్గిరాజేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రాజ్‌భవన్ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు బైక్‌ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ కొద్ది నిలిచిపోయాయి.
కొందరు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్‌లో చెపట్టిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు సందర్భంగా శివసేన రెడ్డి కాలు పోలీసు వాహనంలో ఇరుక్కుంది. దీంతో ఆయన పోలీసు వాహనాన్ని కాలితో తన్ని అద్దాలు ధ్నంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. రాజ్ భవన్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు.