MP K Laxman On KTR : తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం పావులు కదుపుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానీకి కట్టబెట్టేందుకే కేంద్రం ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పందిస్తూ.. కేటీఆర్‌ బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిపించమంటే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ టెండర్లలో పాల్గొంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మాట్లాడిన లక్ష్మణ్‌ .. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 


నిజాం షుగర్స్ ఏమైంది? 


కేంద్ర ప్రభుత్వం 31 ఖనిజాల హక్కులను రాష్ట్రాలకే కేటాయించదని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అసత్యాలను సత్యాలుగా చిత్రీకరిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని లక్ష్మణ్ అన్నారు. నిజాం షుగర్స్‌ను 100 రోజుల్లో తెరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.  హెచ్‌ఎంటీ, అజాంజాహి మిల్స్‌, రేయన్స్‌, ప్రాగా టూల్స్‌, డీబీఆర్‌ మిల్స్‌ వీటి సంగతేంటని లక్ష్మణ్ నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు హెచ్‌ఎంటీ భూములపై కన్నేశారని ఆరోపించారు.  ఐడీపీఎల్‌ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆక్షేపించారు. నల్గొండలో యురేనియం నిల్వలు ఉన్నాయని, తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందన్నారు.   


అధికారమదంతో మాట్లాడుతున్నారు


మంత్రి కేటీఆర్ తానే తెలివైన వాడిని అనుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అధికారమదంతో మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఇంగ్లిష్ వచ్చినంత మాత్రానా ఇతరులను చులకన చేసి మాట్లాడతావా అని మండిపడ్డారు. నేను పక్కా లోకల్ కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడే చదివాను, పీహెచ్‌డీ కూడా ఇక్కడే చేశానని లక్ష్మణ్ తెలిపారు. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కు లేదని ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ చక్కర పరిశ్రమ , ఆల్విన్ కంపెనీ , అజంజహి, ప్రగా టూల్స్, రేయన్స్ ఈ పరిశ్రమల పరిస్థితి ఏమైందని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలు అధికారమదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తలాతోకలేని అందమైన అబద్దాలు అడుతున్నారని విమర్శించారు. బయ్యారం విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఫీజిబిలిటీ కోసం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తామని చట్టంలోనే స్పష్టంగా ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.  


"తెలంగాణను ఉద్దరించమంటే.. ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామంటున్నారు. తెలంగాణ ప్రజలు పేదవాళ్లే కానీ అమాయకులు కాదు. రెండు సార్లు నమ్మారు... వచ్చే ఎన్నికల్లో తండ్రి, కొడుకులకు తగిన బుద్ధిచెబుతారు. ముందు తెలంగాణలో పరిశ్రమలను తెరిపించండి. పరిశ్రమలు మూతబడితే వాటి భూములపై బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు." - ఎంపీ లక్ష్మణ్