MP Laxman : బీజేపీలో చేరేందుకు చాలా మంది టచ్ లో ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి కూడా బీజేపీ చేరనున్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే చాలా మందితో సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్‌లో ఎంపీ కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ ను దెబ్బకొట్టింది కేసీఆర్ అన్నారు.  కేసీఆర్‌ పై మోసగాడనే ముద్ర పడిపోయిందని విమర్శించారు. ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదన్నారు. 






కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ మురికిలో పడ్డట్లే 
 
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు.  చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 


బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ 


మునుగోడు ఉప ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు ముహురం ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు బూర నర్సయ్య గౌడ్. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, ఉప ఎన్నికల సందర్భంగా కనీసం తనతో ఒక్కసారి కూడా చర్చించలేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు బూర. బీసీ నేతలకు టిక్కెట్ ఇవ్వాలని కోరడం కూడా తప్పేనా, ఉద్యమ నేతలకు సైతం కేసీఆర్‌ను కలిసేందుకు రాష్ట్ర సాధన కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తోందని టీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా లేఖలో పలు కీలక అంశాలను బూర నర్సయ్య గౌడ్ ప్రస్తావించడం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలో ఆత్మాభిమానం చంపుకోలేక, బనిసలా బతకలేక రాజీనామా చేశానని బూర ఇదివరకే తన అభిప్రాయాన్ని తెలిపారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత భువనగిరి మాజీ ఎంపీ పయనం ఎటువైపు అనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 19న ఢిల్లీలోని బీజేపీ ఆపీసులో ముఖ్య నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. అక్టోబర్ 13న చండూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాజీ ఎంపీ అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కీలకమైన మునుగోడు ఉపఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు బూర.