Bandi Sanjay : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని, అయినా కేసీఆర్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ కుటుంబం కొనసాగిస్తున్న దాష్టీకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులతో సభను నిర్వహించి నిర్ణయించారు. ఈ సభ ద్వారా  కేసీఆర్ పాలనలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, సీనియర్ నేతలతో బండి సంజయ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. 


అధికార ప్రతినిధులపై ఆగ్రహం 


ముందుగా రాష్ట్ర అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం గత ఏడేళ్లలో పెద్ద ఎత్తున నిధులిచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించి టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని సూచించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కుమ్కక్కై విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తూ కేంద్రంపై నెపం నెట్టేందుకు చేస్తున్న కుట్రలను బయటపెట్టాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అధికార ప్రతినిధులు అధికార పార్టీ నేతల విమర్శలపై వెంటనే స్పందించాలన్నారు. రోజుకు ఒకరు చొప్పున పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. అధికార ప్రతినిధులు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పార్టీ సీనియర్ నేతలతో భేటీ 


అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో పలువురితో బండి సంజయ్ సమావేశమయ్యారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఏ ఆకాంక్షల సాకారం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని ఎండగట్టాలని నిర్ణయించామన్నారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదం కేసీఆర్ పాలనలో పూర్తిగా ఫెయిలైందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు పూర్తిగా న్యాయం జరుగుతుందనే సంకేతాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని బండి సంజయ్ భావిస్తున్నారు.