Bandi Sanjay :బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన సంచలనం అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు ధంస్వం చేశారు. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తు్న్నారని అర్వింద్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమయినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపట్టారు. టీఆర్ఎస్ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని వాళ్లే ఇలా దాడులకు పాల్పడతారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారని విమర్శించారు. గడీల గూండా దాడులకు భయపడే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని, తమ కార్యకర్తల సహనం నశిస్తే తట్టుకోలేరన్నారు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆదేశాలతోనే దాడులు
కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను కవిత కలిశారని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతతో టచ్‌లో
కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అన్నారు. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు.