Bandi Sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆందోళన చేపట్టిన బీజేవైఎం నాయకులు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు బీజేవైఎం నాయకులకు రిమాండ్ విధించింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న  బీజేవైఎం నాయకులను  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం పరామర్శించారు. లీకేజీని ప్రశ్నిoచిన  బీజేవైఎం కార్యకర్తలను జైల్లో బెయిల్ రాకుండా కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పేపర్ లీకేజీ సంఘటనలో ఉన్న రేణుక కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ కు ఈ లీకేజీలో ప్రధాన పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం లీకేజీలో ప్రధాన పాత్ర వహించిందని తెలిపారు. సిట్ లు వేసిన ప్రతీ కేసు పెండింగ్ లో ఉంటున్నాయన్నారు. లీకేజీ కేసులో కూడా సిట్ వేయడం కేసును మాఫీ చేసేందుకని బండి సంజయ్ ఆరోపించారు.  కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీ ఐటీ శాఖకు సంబంధించిందే అన్న బండి సంజయ్...  కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కాపాడుతున్నారని ఆరోపించారు. 


కవిత కోసం జైలు సిద్ధం 


ఓయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని బేషరతుగా వదిలేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ, బీజేవైఎం వాళ్లను జైళ్లకు పంపితే బెదిరేది లేదన్నారు. మేం జైళ్లకు వస్తుంటాం, పోతుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లల్లో  మా కోసం ప్రత్యేక గదులు ఉంచిన భయపడేది లేదన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనుమానితురాలు అయిన కవితకు జైలు సిద్ధంగా ఉందని తెలిపారు.


లీకేజీ చేసిన వాళ్లు జల్సాగా తిరుగుతున్నారు 


 "టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ బయటకు వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేయడానికి బీజేవైఎం కార్యకర్తలు ఆ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేశారు. అక్కడ జరగని వాటిని జరిగినట్లు చూపించి ఏడుగురు బీజేవైఎం కార్యకర్తలను జైలులో పెట్టారు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నించేందుకు వచ్చిన వాళ్లను అన్యాయంగా అరెస్టు చేశారు. చేసిన వాళ్లు జల్సాగా తిరుగుతున్నారు బయట. లీకేజీ చేయించింది కేసీఆర్ కుటుంబమే. పేపర్ల లీకేజీలో ప్రధాన వ్యక్తి కేటీఆర్. యువమోర్చా నేతకి చిన్న పిల్లలు ఉన్నారు. ప్రశ్నించడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారు. బీజేవైఎం కార్యకర్తలు అరెస్టులకు భయపడరు." - బండి సంజయ్ 


టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి 


"టీఎస్పీఎస్సీను పూర్తిగా రద్దు చేయాలి. వాళ్లను ముందు విచారించాలి. ఛైర్మన్ వద్ద ఉండే పాస్ వర్డ్ ఎలా బయటకు వచ్చింది. చివరకు ఎవర్నో ఒకరిని బలిచేస్తారు. సిట్ వేశారంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఇందులో ఉందని అర్థం. నయిమ్ కేసులో సిట్, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్ ఇలా వేసిన సిట్ లు ఇప్పటి వరకూ నివేదికలు ఇవ్వలేదు. సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరపలేదు. కేటీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. ఈ వ్యవహారం ఉన్న ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేణుక కుటుంబం మొత్తం బీఆర్ఎస్ పార్టీ. ధరణి విషయంపై పెద్ద స్కామ్ జరుగుతుంది. వేరే ఎమ్మెల్యేనో, మంత్రి చేస్తే వాళ్లను తొలగిస్తారు. కేటీఆర్ కాబట్టే వదిలేస్తున్నారు."- బండి సంజయ్