Bandi Sanjay : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘‘సరళ్’’ యాప్ ను ఆవిష్కరించారు బండి సంజయ్. కుమార్. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూత్ కమిటీలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. పార్టీకి మూల స్థంభాలు పోలింగ్ బూత్ కమిటీలే అన్నారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మాత్రమే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దిల్లీ నుంచి గల్లీ దాకా కార్యకర్తలను అనుసంధానించే లక్ష్యంగా ‘‘సరళ్’’ యాప్ ను ఆవిష్కరించామన్నారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు సరళ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యకర్తల కష్టాన్ని నేరుగా జాతీయ నాయకత్వం గుర్తించి తగిన అవకాశాలు కల్పించేందుకు ‘‘సరళ్ ’’ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ మళ్లీ కేంద్ర నిధులపై డ్రామా చేస్తుందని విమర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని, అత్యధిక కార్యకర్తలున్న పార్టీ అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టార్జితం వల్లే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ సహా అనేక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బూత్ కమిటీలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 


ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు 


"బీఆర్ఎస్ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఇచ్చిందే తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తోంది. మళ్లీ కోర్టులకు పోయి ఉద్యోగాలు భర్తీ కాకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఒక్కరోజే 75 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే. ఇప్పటిదాకా 1.46 లక్షల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత బీజేపీదే. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. జాతీయ ఉపాధి హామీ నిధులను తప్పుదారి పట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు మేం సిద్ధం... మీ అయ్యను రాజీనామా పత్రం తీసుకొని రమ్మను. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో ఆధారాలతో సహా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆసరా పెన్షన్లు మినహా బీఆర్ఎస్ ప్రజల కోసం చేసిందేం లేదు. రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద జమ చేస్తున్నా పట్టించుకోవడం లేదు." - బండి సంజయ్    


కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం


లిక్కర్ ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని బండి సంజయ్ అన్నారు. పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ఖర్చులు పోగా ఇంకా రూ.10 వేల కోట్ల ఆదాయం మిగులుతోందని, ఆ సొమ్ము ఎటు పోతోందని ప్రశ్నించారు. ఆ వివరాలెందుకు వెల్లడించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రాన్ని బదనాం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రజాకార్ల రాజ్యానికి చరమ గీతం పాడదామన్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ నేతల వ్యవహారం ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరి ఏండ్లు గడిచినా ఇప్పటి  వరకు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియడంతో దారి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. 


బీజేపీ జైళ్లకు భయపడే పార్టీ కాదు 


"నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ తపన. కేసీఆర్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక ఆవేదన పడుతున్న పార్టీ బీజేపీ. తెలంగాణలో రామ రాజ్య స్థాపన కోసం లాఠీ దెబ్బలకు, జైళ్లకు భయపడని పార్టీ బీజేపీ. బీజేపీ కేసులకు, జైళ్లకు భయపడే పార్టీ కాదు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం భరిస్తాం. ప్రజల కోసం పోరాడే నాయకులను, కార్యకర్తలను గుర్తించే పార్టీ బీజేపీ. ఎన్నికల సంఘం ఓటర్ల లిస్టును విడుదల చేసింది. అధికార పార్టీ బీజేపీ కార్యకర్తల, సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. వెంటనే కార్యకర్తలంతా పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించండి. బోగస్ ఓట్లను తొలగించడంతోపాటు బీజేపీ కార్యకర్తల, సానుభూతి పరుల ఓట్లను జాబితాలో చేర్పించండి." - బండి సంజయ్