Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు వారి తల్లిదండ్రులు మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ తోబుట్టువుగా భావించి సబితా ఇంద్రా రెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని, వారి సమస్యలను తక్షణమే తీర్చాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
మళ్లీ ఆందోళన బాట
జులై 30 శనివారం రాత్రి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మెస్ లో భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు ఒప్పుకోలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు మెస్ నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయాలని కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణకు విద్యార్థులు వినతి పత్రం అందించారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి హామీ ఇచ్చారు. ఆ గడువు తేదీ ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి మళ్లీ ఆందోళనకు దిగారు.
ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం- వీసీ
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ అన్నారు. శనివారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేతృత్వంలో ఇవాళ వీసీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కర్తవ్యం చదువుకోవటం యునివర్సిటీకి మంచి పేరు తేవడం అన్నారు. విద్యార్థుల సమస్యలను తీర్చటం తమ కర్తవ్యమని అన్నారు. గత నెల రోజుల నుంచి యునివర్సిటీలో ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నామన్నారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. విద్యార్థుల భోజన సదుపాయం మెరుగుపరచటానికి కొత్త టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నామని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి నివేదికలు తయారు చేస్తామని వీసీ తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను త్వరలోనే సమకూరుస్తామని అన్నారు. విద్యార్థులు కొన్ని రోజులు సంయమనం పాటిస్తే అన్ని సౌకర్యాలు కల్పించటానికి కృషి చేస్తామన్నారు. భోజనం విషయంలో త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని నాణ్యమైన భోజనం అందిస్తామని వీసీ తెలిపారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించారు.
బీజేపీ నేత కాలుపై నుంచి వెళ్లిన పోలీస్ కారు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడానికి, సంఘీభావం తెలపడానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బాసరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేశ్వరం మండలం మన్మద్ నందన్ గ్రామం వద్ద ఎంపీ సోయం బాపురావ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎంపీని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఆ వాహనం పక్కనున్న బీజేవైఎం నేత కుమ్మరి వెంకటేష్ కాలిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతనికి గాయాలయ్యాయి.