హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునాతన సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఓపీ సేవలతో పాటు ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్ ప్రకారం కిషన్‌రెడ్డి పేరు ముందుగా లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు పోటాపోటీగా నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. ఈ కార్యక్రమం నుంచి కిషర్‌రెడ్డి, తలసాని మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
త్వరలో డయాలసిస్ సేవలు
అమీర్ పేటలో నూతనంగా ప్రారంభించిన ఆస్పత్రిలో త్వరలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్ పేటలో రూ.4.53 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంత్రి తలసాని అన్నారు. అందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 6 పడకల ఆసుపత్రిని 30 పడకలకు అప్ గ్రేడ్ చేస్తూ 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2.97 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులు విడుదల కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషిచేశామని మంత్రి తలసాని అన్నారు.
Also Read: ప్రేమ కథా విచిత్రమ్...ఆయనకు 73, ఆమెకు 26... ఈ కథ సుఖాంతం..!
రూ.7.47 కోట్లతో అభివృద్ధి
మంత్రి తలసాని అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2017లో 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు అనుమతిస్తూ రూ.7.47 కోట్లు మంజూరు చేసింది. 2018లో పనులు చేపట్టినప్పటికీ కరోనా కారణంగా పనులు మధ్యలో నిలిచిపోయాయని మంత్రి తలసాని తెలిపారు. జీ ప్లస్ 2 పద్దతిలో హాస్పిటల్ భవనాన్ని ఒక్కో ప్లోర్ 9,451 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రికి వచ్చే పేషంట్స్ కోసం అల్ట్రా సౌండ్ స్కానర్, ఈసీజీ, ఎక్స్ రే, అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: కాలం మారింది.. తెలంగాణ ఏం చేస్తే రేపు భారత్ అదే చేస్తోంది: మంత్రి కేటీఆర్