Breaking News: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 25 Aug 2021 08:17 PM
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!

మాదక ద్రవ్యాల కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని సమాచారం. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులను ఆదేశించింది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించనుంది. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 విద్యార్థులతో వాటర్ ట్యాంక్ కడిగించిన ఉపాధ్యాయులు.. 11కేవీ విద్యుత్ వైరు తగిలి విద్యార్థి మృతి 

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దారుణం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల అత్యుత్సాహంతో విద్యార్థులతో నీటి ట్యాంకును కడిగించారు. అయితే ట్యాంక్ కడిగి బయటకి వస్తున్న విద్యార్థి గోపిచంద్ కి 11కేవీ విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసి స్కూల్స్ లో ఉపాధ్యాయులు అక్కడ నుంచి పరారయ్యారు. విద్యార్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు.

వీసీ సజ్జనార్ బదిలీ

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసి ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


‘ప్రజా సంగ్రామ యాత్ర’ పాటలు విడుదల

ఈనెల 28 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించిన ఆడియో పాటలు విడుదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ విజయశాంతి, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎ. రాకేష్ రెడ్డి తదితరులు ఈ ఆడియో పాటల సీడీని ఆవిష్కరించారు.

హైదరాబాద్ మెట్రోకు గుడ్ న్యూస్

కరోనా వల్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు ఊరట లభించింది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ మెట్రోను ఆదుకుంది. నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ఒప్పుకుంది. గత కొంత కాలంగా సాఫ్ట్ రుణాల కోసం హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ వివిధ బ్యాంకులను ఆశ్రయిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మెట్రో సంస్థ కోరింది.

కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల పంపకాలపై కేఆర్ఎంబీకి (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. 2021-22 ఏడాదికి గాను 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.

రెండోరోజు కొనసాగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామంలోని దళితవాడలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిద్ర చేశారు. రెండోరోజు అంటే ఇవాళ ఉదయం రచ్చబండ నిర్వహించారు. కాలనీ అంతా కలియ తిరిగిన రేవంత్.. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు తమ సమస్యలను రేవంత్‌కు వివరించారు. అనంతరం మేడ్చల్‌ మల్కాజ్ గిరి కలెక్టర్‌ హరీశ్‌కు ఫోన్‌ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు.

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు- షీలా నగర్ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఆనందపురం నుండి శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్‌కి వ్యానులో కోళ్లు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోళ్ల ఫారం వ్యాన్ ఎయిర్‌పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెనకనుంచి ఢీ‌కొంది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు.

అరెస్టు చేస్తామని మంత్రికి ఫేక్ నోటీసులు

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు అరెస్టు చేస్తామంటూ నకిలీ నోటీసులు రావడం కలకలం రేపుతోంది. ఈడీ అధికారులు పంపినట్లుగా ఆ నోటీసులను ఎవరో అగంతకులు పంపారు. ఆ నోటీసులపై అనుమానం వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ ఈడీ అధికారులను సంప్రదించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ నోటీసులపై ఈడీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.  420, 468, 471 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయగా.. విచారణలో భాగంగా పోలీసులు మంత్రి గంగులకు ఫోన్ చేశారు. అయితే, ఈ నకిలీ నోటీసుపై మంత్రి గంగుల పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్ల దిన్నెలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  బొలేరో గూడ్స్ వాహనం నుంచి జారి పడి నలుగురు వ్యక్తులు చనిపోయారు. పొదిలి మండలం అక్కచెరువుకు వీరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

Background

తెలంగాణలో బుధవారం తెల్లవారుజామునే ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణమని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. రాత్రి వేళ కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బస్సు బోల్తా పడిపోయి ఉంది. దీంతో వారు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకొచ్చారు. ఇరుక్కుపోయిన వారిని తోటి ప్రయాణికులు కాపాడారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.