Bandla Ganesh : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "నమస్కారం.. కుటుంబ బాధ్యతలు వల్ల .. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నా" అని బండ్ల గణేష్ అన్నారు. 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2018లో రాజకీయ రంగ ప్రవేశం
బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో బండ్ల గణేష్ స్పీచ్ లకు చాలా క్రేజ్ ఉంది. ఆయన మాట్లాడే మాటలు తూటాల్లా పేలేవి. నిర్మాతగా బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల విడుదలైన బ్లేడు బాబ్జీ సినిమాలో లీడ్ రోల్‌లో నటించారు. 2018లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన బండ్ల గణేష్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున టీవీ టిబెట్స్ లో తరచూ పాల్గొనేవారు. అప్పడప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతల వల్ల పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. పవన్ కల్యాణ్ అభిమాని అయిన బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
బ్లేడ్ వివాదం
2018లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన బండ్ల గణేష్... ఓ టీవీ ఇంటర్వ్యూలో 2018 "డిసెంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు 7’O Clock బ్లేడ్ తీసుకురండి. ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో నా పీక కోసుకుంటా. ఇదే నా ఛాలెంజ్. హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటారో" అంటూ బండ్ల గణేష్ ఛాలెంజ్ చేశారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో బ్లేడ్ సమస్య ఫేస్ చేశారు బండ్ల గణేష్.