హుజూరాబాద్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజుకో ట్విస్ట్ తో ముందుకెళ్తోంది. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అనే విషయం పక్కనబెడితే.. నేతల పార్టీ మార్పులతో రాజకీయ వేడి పెరుగుతోంది. పార్టీలు.. సమీకరణాలు మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయం మారింది. హైదరాబాద్ ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. కౌశిక్‌తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు.
ఫోన్ సంభాషణతో లొల్లి.. లొల్లి..
ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ తరఫున టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ.. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు. ఎంత డబ్బు కావాలో చూసుకుంటానని.. ప్రస్తుతం ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.5వేలు ఇస్తానని తెలిపారు.
ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. ఈ కారణంగా కౌశిక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్ లో గులాబి పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
మరి టికెట్ ఎవ్వరికి
కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ లో చేరారు... కానీ టికెట్ ఎవరికీ అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కౌశిక్ రెడ్డి తనకే టికెట్ అని భావిస్తున్నా.. మెుదటి నుంచి ఉద్యమ నేతగా ఉన్న గెల్లు శ్రీను టికెట్ పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెల్లు శ్రీను హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా రోజులుగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీను.. మకాం.. విణవంకకు మార్చినట్లు తెలుస్తోంది. యువత ఫాలోయింగ్ ఉండటంతోపాటు.. పార్టీకి నమ్మినబంటుగా ఉన్న గెల్లుకే టికెట్ రావాలని.. కార్యకర్తలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ను గెల్లు శ్రీను కలిశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కారెక్కడంతో మరి.. టికెట్ ఎవరి వస్తుందా? అనే చర్చ నడుస్తుంది. ఎవరు కాంప్రమైజ్ అవుతారనే ప్రశ్న వస్తోంది.
అయితే సీఎం కేసీఆర్ కండువా కప్పి.. ఆహ్వానించడంతో.. కౌశిక్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తారనే చర్చ జరుగుతుంది. కౌశిక్ రెడ్డి చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలనూ.. టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లారు. ఇది అదనపు బలం అని... టికెట్ కచ్చితంగా కౌశిక్ రెడ్డికే వస్తుందని.. ఆయన అభిమానులు చెబుతున్నారు.