టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ కలిసిపోయారు అని కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని.. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.


రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు సరికాదు..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మతతత్వ పార్టీ కాగా.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని.. ఇవి ఎన్నటికీ రెండు భిన్న ధృవాలుగా ఉంటాయని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ భట్టి విక్రమార్క అన్నారు. అయితే కేటీఆర్ రాజకీయ అవగాహన లేకుండా, గాలి మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు టీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని, హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మరన్నారు. ఈటలను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పారు. ఎన్నికల తరువాత ఈటెల కాంగ్రెస్ లోకి వస్తారని కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 


Also Read: రేవంత్ రెడ్డిని కలిశాను... తప్పేంటి ? కేటీఆర్‌కు ఈటల కౌంటర్ !


‘టీఆరెఎస్, బీజేపీ నేతల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. మాజీ మంత్రి ఈటల అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ ఎందుకు ఆపివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గెలుపు కోసం పోటీపడుతున్నాయి. వీరి దోపిడీని అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాయి. కాంగ్రెస్ నాయకులపై బురదజల్లడాన్ని ప్రజలు నమ్మరు. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సరికాదని’ భట్టి విక్రమార్క సూచించారు.


Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...! 


గాంధీభవన్లో గాడ్సేలు ఉండరు. కేవలం కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే ఉంటారు. మా పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేటీఆర్ మాట్లాడటం సరికాదు. మా పార్టీలో మా మాట కాకుండా కేటీఆర్ మాట నెగ్గుతుందా. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ మంతనాలు.. దాని ద్వారా బీజేపీతో కలిసి పనిచేసే సంకేతాలు వెళ్లాయి. మరోవైపు దళిత బంధు పథకంపై బీజేపీ వైఖరి సరిగా లేదు. దళిత బంధును టీఆర్ఎస్, బీజేపీ కలిసి నిలిపివేశాయి. కనుక తమ అభ్యర్థి బాల్ముర్ వెంకట్ ను ప్రజలు గెలిపించాలి. ప్రతిపక్షాల ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులకు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించవా అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రశ్నించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి