హుజూరాబాద్‌లో మరో నెల వరకూ ఎన్నికల షెడ్యూల్ రాదని క్లారిటీ రావడంతో రాజకీయ పార్టీలు తదుపరి వ్యూహంపై దృష్టి పెట్టాయి. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీలు ఈసీ నిర్ణయంతో కంగారు పడుతున్నాయి. అభ్యర్థిని ఖరారు చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ పరిస్థితి కాస్త రిలీఫ్‌ను ఇస్తోంది. అయితే ఎన్నికల సమయం ఎంత పెరిగితే అంత ఖర్చు పెరిగిపోతుందని ఇతర రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగానే భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి హుజూరాబాద్‌లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే.. ప్రభుత్వ పరంగా రూ. వెయ్యి కోట్లను ఎన్నికలకు ముందు హూజూరాబాద్ దళితులకు పంపిణీ చేయడానికి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాట్లు చేశారు. 16వ తేదీన భారీ సభను నిర్వహించి తొలి విడతగా రూ. ఐదు వందల కోట్లను లబ్బిదారులకు పంపిణీ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆ పథకం ప్రారంభానికి ముందుగానే నోటిఫికేషన్ వస్తుందన్న అనుమానంతో దత్తత గ్రామం వాసాలమర్రిలోనే కేసీఆర్ లాంఛనంగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పథకాన్ని పూర్తి స్తాయిలో అమలు చేయాల్సి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందన్న కారణంగా పథకం అమలును ఆలస్యం చేస్తే దళిత వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
అదే సమయంలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థిని ప్రకటించారు. హరీష్ రావు హుజూరాబాద్‌లోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో క్లారిటీ లేకపోవడం.. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఏర్పడటానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ప్రతీ రోజూ... ప్రచార కార్యక్రమాలకు పెట్టుకునేఖర్చు చాలా ఎక్కువే, ఈ సమస్య టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు ... ఇతర పార్టీలకూ ఉంది. అందుకే.. హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ అన్ని రాజకీయ పార్టీలు కాస్త దూకుడు తగ్గించుకునే అవకాశం ఉందని అటున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగిస్తున్నందున ఒక్క సారిగా ఆపేశామన్న భావన రాకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉపఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించే ఉద్దేశం లేదని కొంత కాలంగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం ఉంది. అలా నిర్వహించే అవకాశమే ఉంటే ఉత్తరాఖండ్ సీఎంతో బీజేపీ రాజీనామా చేయించి ఉండదని అంటున్నారు. అదే నిజం అయితే.. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోనే ఉపఎన్నికలు జరుగుతాయి. ఆ విషయంపై వచ్చే నెలలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈసీ ఇదే కోణంలో ఆలోచిస్తే... హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్నీ సైలెంటయిపోయే చాన్స్ ఉంది. కానీ దళిత బంధు అమలుకు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెరగనుంది.