Huzurabad, Badvel Bypoll Results Live: ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ
హుజూరాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ను ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అభినందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. బీజేపీకి మొత్తం 107022 ఓట్లు, టీఆర్ఎస్ 83167 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,855 మెజార్టీతో గెలుపొందారు.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.
ఈటల రాజేందర్ కు మరింత ఆధిక్యత పెరిగింది. 20వ రౌండ్ లో 1,474 ఆధిక్యం వచ్చింది. మెుత్తం 21,009 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు.
రౌండు రౌండుకు ఈటల రాజేందర్ కు ఆధిక్యం పెరుగుతోంది. 19వ రౌండ్ లోనే 3047 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.
18వ రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యం కనబరించింది. 18వ రౌండ్ ముగిసేసరికి.. ఈటల రాజేందర్ 16,494 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17వ రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం లభించింది. 17వ రౌండ్‌లో బీజేపీకి 1423 ఓట్ల భారీ ఆధిక్యం వచ్చింది. 17 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14618 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. 1,423 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 17వ రౌండ్‌లో ఈటలకు 5,610, గెల్లు శ్రీనివాస్ కు 4,187 ఓట్లు వచ్చాయి.
16వ రౌండ్‌లో బీజేపీకి 1,772 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 16వ రౌండ్‌లో ఈటలకు 5,689 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్ కు 3,917 ఓట్లు వచ్చాయి.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ ఒక్క సభ పెట్టలేదన్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ లో పని చేసినట్లుగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పని చేయలేదన్నారు. కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో గట్టి క్యాడర్ ఉన్నా, తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదన్నారు. హుజూరాబాద్ పై వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు వివరిస్తానన్నారు.
15వ రౌండ్‌లోనూ బీజేపీకి 2,149 ఓట్ల ఆధిక్యం లభించింది. మెుత్తం బీజేపీకి 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
హుజూరాబాద్‌లో ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఈటల రాజేందర్ ఆధిక్యం 14వ రౌండ్‌లోనూ కొనసాగింది. బీజేపీకి 1,046 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 14 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
13వ రౌండ్‌లో బీజేపీ 1,865 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 8,388 ఓట్ల ఆధిక్యం ఉంది. బీజేపీకి 4,836, టీఆర్ఎస్ కు 2,971 ఓట్లు వచ్చాయి.
హుజూరాబాద్ కౌంటింగ్ లో ఇప్పటి వరకు 83 వేల ఓట్లు లెక్కించారు. హుజూరాబాద్, వినవంక మండలాలలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమ్మికుంటా, ఇల్లంతు కుంట, కమలపూర్ మండలాల్లో ఇంకా ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇంకా 1,20,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. జమ్మికుంట మండల ఓట్లు లెక్కింపు ప్రారంభించారు.
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిశారు. బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలో విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్ ను కలిశారు.
8వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ మళ్లీ 11వ రౌండ్‌లో ఆధిక్యం కనబర్చింది. ఈ రౌండ్‌లో సమీప ప్రత్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 367 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా చూస్తే ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కి 4,326 ఓట్లు, బీజేపీకి 3,941 ఓట్లు వచ్చాయి.
8వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ మళ్లీ 11వ రౌండ్‌లో ఆధిక్యం కనబర్చింది. ఈ రౌండ్‌లో సమీప ప్రత్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 367 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా చూస్తే ఈటల రాజేందర్ 5,264 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కి 4,326 ఓట్లు, బీజేపీకి 3,941 ఓట్లు వచ్చాయి.
పదో రౌండ్‌లో కూడా ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ ఆధిక్యం మరింత పెరిగింది. 5,631 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. ఒక్క పదో రౌండ్‌లో మాత్రం బీజేపీ 526 ఓట్ల ముందంజలో ఉంది. ఈ రౌండ్‌లో బీజేపీకి 4,295 ఓట్లు.. టీఆర్‌ఎస్‌కి 3,709 ఓట్లు వచ్చాయి.
9వ రౌండ్‌లో బీజేపీకి అత్యధిక ఆధిక్యం వచ్చింది. ఏకంగా ఆయన 1,835 ఆధిక్యం సాధించారు. దీంతో ఈటల ఆధిక్యత 5,105కి చేరింది. 8వ రౌండ్‌లో ఈటల వెనుకంజ వేసినా 9వ రౌండ్‌కి మరింత ఉత్సాహంతో ముందంజలోకి వచ్చారు. ఇప్పటిదాకా అన్ని రౌండ్లలోకెల్లా ఈటలకు ఇదే భారీ మెజారిటీ కావడం విశేషం.
8 రౌండ్ల తర్వాత అన్ని కలిపి బీజేపీ 35,107, టీఆర్‌ఎస్ 31,837, కాంగ్రెస్ 1,175 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ 8వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 4,248, బీజేపీ 4,086, కాంగ్రెస్ 89 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల 8 రౌండ్లు ముగిసేసరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కానీ, ఒక్క గెల్లు సొంత గ్రామం హిమ్మత్ నగర్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఇదే ప్రాంతంలో బీజేపీ 191 ఓట్లు ఆధిక్యం ప్రదర్శించడం విశేషం.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంతో తాము భారీ ఆధిక్యంతో గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్మారు. అయితే, అనూహ్యంగా శాలపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించడం తీవ్రమైన చర్చనీయాంశమైంది. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
8వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు స్వల్ప ఊరట లభించింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం కనబర్చింది. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత ఊరు హిమ్మత్ నగర్ ఉండడం వల్ల ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యానికి కారణంగా ఉంది. 8వ రౌండ్‌లో దాదాపు 162 ఓట్ల మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది.
హుజూరాబాద్‌లో ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా ముగిసింది. ఈ స్థితిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,432 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. ఏడో రౌండ్‌లో బీజేపీ 246 ఓట్ల మెజారిటీ సాధించింది. ఈ రౌండ్‌లో బీజేపీకి 4,038, టీఆర్ఎస్‌కి 3,792, కాంగ్రెస్‌కి 94 ఓట్లు వచ్చాయి.
హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 45,910 ఓట్లు లెక్కించారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,05,236 ఓట్లు పోలయ్యాయి. ఇంకా 1,59,326 ఓట్లు లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఎలక్షన్ కౌంటింగ్‌పై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీగా పందాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని పందెం రాయుళ్లు బెట్టింగ్ కడుతున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ఐదో రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు 4,358 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,041 ఓట్లు, వెంకట్‌కు 132 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌తో కలిపి ఈటలకు మొత్తం 17,969 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్‌కు 16,144 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్‌లో కూడా ఈటలే ముందజంలో దూసుకుపోతున్నారు.
బద్వేలులో ఓట్ల లెక్కింపు 10వ రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్‌లో వైఎస్ఆర్ సీపీ 10,052, బీజేపీ 1,554, కాంగ్రెస్ 448 ఓట్లు దక్కించుకున్నాయి. నోటాకు 285 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 85,505 ఓట్ల భారీ మెజారిటీతో కొనసాగుతున్నారు. దీంతో ఆమె గెలుపు ఖాయమైపోయింది.
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నాలుగో రౌండ్‌లో కూడా ఈటల రాజేందర్ దూసుకెళ్లారు. ఆయనకు 4,444 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 3,882 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌కు 234 ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఈటల రాజేందర్‌కు 13,525 ఓట్లు వచ్చాయి. గెల్లుకు 12,262 ఓట్లు వచ్చినట్లయింది. దీంతో మొత్తం ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 1,825 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ విజయం దాదాపు ఖరారైపోయింది. ఇప్పటి దాకా 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆ పార్టీ అభ్యర్థి సుధకు 68,492 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో ఇక వైఎస్ఆర్ సీపీ గెలుపు ఖాయం అయిపోయింది.
హుజూరాబాద్‌లో మూడో రౌండ్‌లో కూడా ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ రౌండ్‌లో ఏకంగా 911 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు కలిపి 1269 ఓట్ల ఆధిక్యంలో ఈటల కొనసాగుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో రెండో రౌండ్ కూడా పూర్తయింది. ఇందులో టీఆర్ఎస్‌కు 4,659 ఓట్లు, బీజేపీకి 4,851 ఓట్లు, కాంగ్రెస్‌కు 200 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 193 ఓట్ల ముందంజలో ఉన్నారు. దీంతో మొదటి రౌండ్‌తో కలిపి ఇప్పటి దాకా ఈటల రాజేందర్ 359 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
బద్వేలులో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బద్వేలు ఉప ఎన్నిక లెక్కింపులో భాగంగా మూడు రౌండ్లు పూర్తయ్యాయి. ఈ స్థితిలో వైఎస్ఆర్ సీపీ భారీ ఆధిక్యంలో ఉంది. 23,700 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఉన్నారు.
హుజూరాబాద్‌లోనూ తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. ఇందులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. 166 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఈటల ఉన్నారు. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4,444, బీజేపీకి 4,610, కాంగ్రెస్‌కు 119 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో మొత్తం 9,173 ఓట్లు వచ్చాయి.
బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో భాగంగా తొలి రౌండ్ ఫలితం వెల్లడైంది. ఈ రౌండ్‌లో వైఎస్ఆర్ సీపీకే ఆధిక్యం లభించింది. ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 8,790 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. వైసీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్‌కి 580, నోటా 342 ఓట్లు వచ్చాయి.
ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుండగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 160 ఓట్ల ఆధిక్యతలో గెల్లు శ్రీనివాస్ ముందున్నారు. మొత్తం 723 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 503 టీఆర్ఎస్‌కు, 159 బీజేపీకి, 32 కాంగ్రెస్‌కు వచ్చాయి. 14 చెల్లనివిగా గుర్తించారు.
బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలైంది. బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఓట్ల లెక్కింపు కోసం బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 10 లేదా 12 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్క పెడతారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు ఏజెంట్‌లకు గేట్ పాస్‌తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరి అని పోలీసులు చెప్పారు. ఐడీ కార్డు లేకపోవడంతో పలువురిని పోలీసులు గేటు దగ్గర ఆపేశారు. ఐడీ కార్డు తప్పనిసరి అని చెప్పడంతో లెక్కింపు కేంద్రం వద్ద గేట్ నెంబర్ 2 దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాకి దిగారు. దీంతో చివరికి వారి పేరు వివరాలు నమోదు చేసుకొని ఏజెంట్లను లోపలికి పోలీసులు అనుమతించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ఎస్ ఆర్ ఆర్ కళాశాల ఉన్న ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించామని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి సత్యనారాయణ మీడియాతో తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో సిటీకి బయటే వాహనాలను మళ్ళించామని, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఏ పార్టీ వారైనా గూమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించామని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎలాంటి వేడుకలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదని ఆయన తేల్చి చెప్పారు.
Background
తెలంగాణ రాజకీయాల్లో కొద్ది నెలలుగా నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో విజేత ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కాలేజీలో కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలు, కౌంటింగ్ సెంటర్ లోపల ఆర్మ్‌డ్ ఫోర్స్ (ఏఆర్) సిబ్బంది, వెలుపల సివిల్ పోలీసులతో మొత్తానికి మూడంచెల భద్రత ఏర్పాటు కట్టుదిట్టం చేశారు.
కౌంటింగ్ పురస్కరించుకుని కాలేజీ పరిసరాల్లో మంగళవారం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. టీఆర్‌ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బల్మూరి వెంకట్‌తో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: Gold-Silver Price: ఇవాళే ధనత్రయోదశి.. బంగారం ధరలో కాస్త ఊరట.. తగ్గిన వెండి, నేటి ధరలివీ..
తొలి ఫలితం ఉదయం 9.30 కే..
ఎన్నికల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కించనున్నారు. ఆ తర్వాత తొలి ఈవీఎంను ఉదయం 8.30 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంతో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి బూత్‌కి చెందిన ఈవీఎంను తెరుస్తారు.
ఏర్పాట్లు ఇవీ..
ప్రభుత్వ కాలేజీలో రెండు విశాలమైన హాళ్లలో 306 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 306 ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటించేలా టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కు సగటున అరగంట సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లు 2 లక్షలు దాటడంతో ఫలితం అధికారికంగా వెలువడే సరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Dhanteras 2021: ఈ దంతేరాస్‌కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -