By Election Live Updates: ముగిసిన బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్
నేడే హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల పోలింగ్.. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి ఈవీఎంలతో కరీంనగర్ బయలుదేరిన బస్సులు జమ్మికుంట సమీపంలో గంట సేపటి నుంచి నిలిచిపోయాయి. ఈ బస్సుల్లో ఒకదానికి పంక్చర్ కావడంతో టైర్ మార్చడం కోసం ఆపినట్లు అధికారులు చెబుతున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో రాత్రి 7 గంటలకు 86.33 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేల్ లో 68.12 పోలింగ్ శాతం నమోదు అయ్యింది.
బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్ లో 79.05 శాతం, బద్వేల్ లో 59.58 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న EVMలను పటిష్ట భద్రత మధ్య కరీంనగర్ కు తరలించనున్నారు. పట్టణంలోని SRR కళాశాలలో ఈవీఎంలను భద్రపరచనున్నారు.
బద్వేల్ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటలకు 59.58 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏలను స్థానికులు అడ్డుకున్నారు. వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
హుజూరాబాద్ లో ఐదు గంటల వరకు 76.26 పోలింగ్ శాతం నమోదైంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేలు ఉపఎన్నికల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82శాతం పోలింగ్ నమోదైంది.
కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని మూడు వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పీఆర్వో ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
హుజూరాబాద్ పట్టణంలో డబ్బు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. హనుమాన్ ఆలయం వద్ద డబ్బు పంచుతున్న సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాయి. ఆ వ్యక్తి నాన్ లోకల్ అని.. హుజూరాబాద్ కు వచ్చి.. డబ్బులు పంచుతున్నాడని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఓటేసేందుకు ప్రజలు తరలిరావాలని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. పోలింగ్ శాతం బాగా పెరగాలన్నారు. ఆయన స్వగ్రామం ఇన్మంత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 వరకు పోలింగ్ కొనసాగనుంది.
హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
హుజూరాబాద్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. హుజూరాబాద్‌లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను ఎంపీ జీవీఎల్ కలిశారు. బద్వేలు ఉపఎన్నికలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బయటి వ్యక్తులు వస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్... బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 281 పోలింగ్ కేంద్రాల్లోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.
పోలింగ్ తేదీన ప్రెస్ మీట్ నిర్వహించారని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరులో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్‌రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ధర్నా చేశారు. చల్లూరులో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బద్వేలు నియోజకవర్గంలోని ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని బీజేపీ, వైసీపీ అభ్యర్థులు పరిశీలించారు. బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. అట్లూరు, ఎస్.వెంకటాపురానికి బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వైసీపీ అభ్యర్థి సుధ అన్నారు.
బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది. బద్వేలు ఉప ఎన్నికను వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు.
హుజూరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు.
బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
కమలాపూర్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతిమణితోపాటు జమున కూడా ఓటు వేశారు.
హుజూరాబాద్, బద్వేలులో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. బద్వేలులో ఉపఎన్నిక పొలింగ్ కొనసాగుతోంది. 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది.
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోలింగ్ బూత్‌ను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతోపాటు మరికొంతమంది అభ్యర్తులుగా పోటీలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థుగా బరిలో నిలిచారు. హుజూరాబాద్ 30 మంది, బద్వేలులో 15 మంది పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మెుదటి దానిలో 16 మంది, రెండో దానిలో 14 మంది అభ్యర్థులతోపాటు చివరన నోటా గుర్తు ఉంటుంది. బద్వేలులోని పోలింగ్ కేంద్రాల్లో ఒకే ఈవీఎంను ఏర్పాటు చేశారు. బద్వేలులో తొలిగంటలో 9.5 శాతం పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ లో 7.5 శాతం పోలింగ్ నమోదైంది
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్ ఉన్నారు. కమలాపూర్ లో ఈటల రాజేందర్ ఓటు వేయనున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ ఈవీఎంలు మెురాయిస్తున్నట్టు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హుజూరాబాద్‌లో మెుత్తం 2,37,022 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్‌లో పురుష ఓటర్లు 1,18,720 మంది, మహిళా ఓటర్లు 1,17,563 మంది ఉన్నారు. ఉపఎన్నిక బరిలో మెుత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు.
Background
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. చివరి గంటను కొవిడ్‌తో బాధపడుతున్న వారు పీపీఈ కిట్లతో వచ్చి ఓటు వేసేందుకు కేటాయించారు. 2018లో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి మరింత పెంచేలా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కోరారు.
‘‘అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఓటర్లు విధిగా మాస్క్ ధరించి ఓటేయడానికి వెళ్లాలి. వివిధ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిపై కేసులు కూడా నమోదు చేశారు. రూ.మూడున్నర కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దానిలో 16 మంది, రెండో దానిలో 14 మంది అభ్యర్థులతోపాటు చివరన నోటా గుర్తు ఉంటుంది. నవంబరు 2న కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 2,200 మంది రిజర్వ్ పోలీసులు ఉన్నారని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు కూడా పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. ఇప్పటివరకూ 130 కేసులు వివిధ పార్టీలపై నమోదు చేశామని, మూడున్నర కోట్ల నగదు కూడా సీజ్ చేశామని తెలిపారు.
ప్రజలకు రూ.6 వేల నుండి రూ.10 వేల వరకు ఒక్కో ఓటుకు పంచుతున్నారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ సెక్షన్ 171(బి)కింద డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరం అని అన్నారు. డబ్బులు అడిగిన వారిపై అలాగే ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. హరీష్ రావు బసచేసిన కిట్స్ కాలేజీ లో సైతం తనిఖీలు చేశామని అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో ఎన్నికల మెటీరియల్ పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
అక్రమాలు గుర్తిస్తే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు
మరోవైపు ఏమైనా అక్రమాలు జరిగినట్లు ప్రజలు గుర్తిస్తే సి విజిల్ యాప్ ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కడినుండైనా సమాచారం అందించవచ్చని, సదరు ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ఇక కోవిడ్ పేషెంట్లకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని వారు సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. వారికోసం అందుబాటులో పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, విజయవంతంగా ఈ ఉప ఎన్నికని పూర్తి చేస్తామని అన్నారు. ఎవరైనా కావాలని పోలింగ్ కేంద్రాల వద్ద గలాటా సృష్టిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఓటింగ్ ముగిసేవరకూ ప్రజలందరూ ఎన్నికల కమిషన్‌కి, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల గణాంకాల విషయానికి వస్తే బరిలో నిలబడ్డ మొత్తం అభ్యర్థుల సంఖ్య 30. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ముగ్గురు కాగా మిగతా వారు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల వారు ఉన్నారు. హుజూరాబాద్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 37 వేల 22 మంది. పోలింగ్ కేంద్రాల సంఖ్య 306 కాగా ఎన్నికల సిబ్బంది 1715. నియోజకవర్గం మొత్తం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు 127 గా గుర్తించారు.
బద్వేలులోనూ అన్ని ఏర్పాట్లు
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక కూడా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక్కడ కూడా శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామ రాజు, రిటర్నింగ్ అధికారి, రాజంపేట సబ్ కలెక్టరు కేతన్‌గార్గ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాల్లో శుక్రవారం ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా.. వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -