Telangana News : హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం కాసేపు కలకలం రేపింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. పలువురు ముస్లిం విద్యార్థినులు శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్‌తో రావద్దని సూచించారు. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది.
హిజాబ్‌తో పరీక్షకు అనుమతించని కాలేజీ యాజమాన్యం
వారితో గొడవెందుకనుకున్న కొంతమంది విద్యార్థినులు హిజాబ్ తీసేసి పరీక్షలు రాశారు. మరికొంతపెద్దలకు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి కాలేజీ యాజమాన్యం హిజాబ్‌తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించారు. అరగంటపాటు తమను ఆపేశారని గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదని విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత రోజు నుంచి అంటే.. శనివారం నుంచి హిజాబ్ లేకుండానే రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు.
హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థినుల తల్లిదండ్రులు
దీనిపై ఆయన ముస్లిం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని పరీక్షా కేంద్రంలోకి హిజాబ్‌తో విద్యార్థినులను అనుమతించకపోవడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. హిజాబ్ తో పరీక్షలు రాయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎవరి డ్రెస్సింగ్‌నైనా ఆహార్యాన్నైనా గౌరవించాలని, . తలనుంచి పాదాల వరకు కప్పి ఉంచే దుస్తుల విషయంలో గొడవ తగదని అన్నారు . అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకున్నా సమస్య కాదు… అయితే పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్యలు కొన్ని సందర్బాలలో వస్తున్నాయని అన్నారు.
వస్త్రధారణపై మహమూద్ అలీ వ్యాఖ్యలు వైరల్ - తప్పేమీ మాట్లాడలేదన్న హోంమంత్రి
మహమూద్ అలీ ఇలా మహిళ వస్త్రధారణ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. విమర్శలు రావడంతో మహమూద్ అలీ కూడా స్పందించారు. తాను మహిళలపై ఎన్నడూ అగౌరవ వ్యాఖ్యాలు చేయలేదని, అలాగే వారు ధరించే డ్రస్ విషయంలోనూ తాను అభ్యంతరం తెలపలేదని వివరణ ఇచ్చారు..