Sangareddy District News: సంగారెడ్డి: ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని HMDA ఆమోదించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.




Photo: Twitter


ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31న గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాం నిర్వహించాల్సి ఉంది. అయితే విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని అధికారుల ఫిర్యాదుతో పోలీసులు గద్దర్ విగ్రహావిష్కరణను అడ్డుకున్నారు. ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, లేకపోతే కార్యక్రమం నిర్వహణకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.






ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహాన్ని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​మున్సిపాలిటీలో ఏర్పాటు చేయాలని అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని కొందరు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మరికొందరు నేతలు, సంఘాలు అధికారులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. భరత్ చేపట్టిన దీక్షకు వివిధ పార్టీలు, హెచ్​సీయూ స్టూడెంట్లు, పీఎస్టీయూ స్టూడెంట్ సంఘాల నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. అందుకుముందు తెల్లాపూర్​లో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఆ సమయంలోనే గద్దర్ విగ్రహ ఏర్పాటు అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లగా.. గద్దర్ విగ్రహం ఏర్పాటుకు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం తెలిసిందే. గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల నేతలు కోరారు. 


జనవరి 31 న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా గద్దర్​ విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్థానిక నేతలు భావించారు. తాజాగా గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంపై నేతలు, యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.