Congres News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా తెరపైకి వచ్చింది. అధికార ప్రతిపక్షాలు దీన్ని పెద్దగా పెట్టించుకోకపోయినా కాంగ్రెస్ దీన్ని హైలెట్ చేస్తోంది. పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీతో కుమ్మక్కై అన్ని పార్టీలు పక్కన పెట్టేశాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని అంటున్నారు. 


ప్రత్యేక హోదాను ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు షర్మిల బహిరంగ సభల్లో చెప్పడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయనున్నారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయనున్నారు షర్మిల. పదేళ్ల క్రితం ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని ఇది నమ్మక ద్రోహం అని నిరసన చేపట్టనున్నారు. దీనికి కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సీనియర్ లీడర్లు రానున్నారు. ప్రస్తుతం న్యాయ్‌ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలో పాల్గొంటారని చెబుతున్నారు.