Formula E car race In Hyderabad | హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వులను డిసెంబర్ 31 వరకు హైకోర్టు పొడిగించింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు తదుపరి విచారణ 31కి వాయిదా వేసింది. దాంతో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను అప్పటివరకూ అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఊరట కల్పించింది.
ఈకేసులో ఫిర్యాదుదారుడు దానకిశోర్ స్టేట్మెంట్‌ను ఏసీబీ రికార్డ్ చేసింది. దాంతో దానకిశోర్ స్టేట్మెంట్, ఏసీబీ కౌంటర్ నేడు హైకోర్టులో కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరినా హైకోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పింది.
బీఆర్ఎస్ హయాంలో కారు రేసింగ్‌కు ఒప్పందం..
తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి వెళ్లడానికి హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాంతో గత బీఆర్ఎస్ హయాంలో కార్ రేసింగ్ నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. మిగతా నగరాలు పోటీ పడుతున్నా హైదరాబాద్ కు ఛాన్స్ తీసుకుని ఘనంగా నిర్వహించారు. నెల్సన్ సంస్థ అయితే రూ.700 కోట్లు ప్రయోజనం పొందారని చెప్పింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కానీ ఆ సమయంలో నష్టం వచ్చిందని గ్రీన్ కో సంస్థ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోగా, ఈ కార్ రేస్ రద్దవుతుందని భావించి గత ప్రభుత్వం రూ.55 కోట్లు నిర్వహణ సంస్థకు చెల్లించింది. ఒకవేళ ఒప్పందం రద్దు అయితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చింటే ఈజీగా స్పాన్సర్‌ను తెచ్చేవారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
గవర్నర్ అనమతితో పెరిగిన దూకుడు
2018 కంటే ముందు ఎవరి మీద అయినా అవినీతి ఆరోపణలు వస్తే చాలు వెంటనే ఏసీబీ, సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపేవి. కానీ 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌కు సవరణ తీసుకురావడంతో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన హెచ్‌వోడీ అనుమతిని ఏబీసీ తీసుకోవాలి. అయితే నేరుగా డబ్బులు తీసుకుంటూ దొరికిపోతే మాత్రం ఎవరి అనుమతి అవసరం లేదు. ఈ-కార్ రేసింగ్ హైదరాబాద్ విషయంలో డబ్బులు చేతులు మారలేదు. ఆరోపణలు రావడంతో విచారణకు సంబంధించి గవర్నర్ అనుమతి కోరారు. నెల తరువాత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి ఇవ్వడంతో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి ఆర్వింద్‌కుమార్, HMDA చీఫ్ ఇంజినీర్ పై కేసు నమోదు చేశారు.
క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా రూ.55 కోట్లు ఓ సంస్థకు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే హెచ్‌ఎండీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా ఎంఏయూడీ మంత్రి కేటీఆర్, మెంబర్ కన్వీనర్‌గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్ ఉన్నారు. కేబినెట్ పర్మిషన్ లేకుండానే వైస్ చైర్మన్‌గా నిర్ణయం తీసుకొనే అధికారం తనకు ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అందుక సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను కేటీఆర్ ఏసీబీకి ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కరెక్టుగా ఉన్నాయని తేలితే కేసు కొట్టి వేయాల్సి ఉంటుంది.