Kadem Project: భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్రమంగా వరద వస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు భారీ వరద ప్రవాహంతో నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో 696 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయంలోకి 21,100 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 17,745 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు వాడుతున్నారు. 


గోదావరి పరివాహక ప్రాంతాల్లో అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి ఉంచారు. నిజాంసాగర్ నుంచి మొదలు సమ్మక్క సాగర్ వరకు ఎగువ నుంచి వచ్చిన ప్రవాహాలను వచ్చినట్లు దిగువకు పంపుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరోసారి పూర్తిగా నిండి జలకళ ఉట్టిపడుతోంది. పై నుంచి 64 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే.. దిగువకు 54 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నిజాంసాగర్ జలాశయం సైతం నిండింది. 


ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. స్థానిక ప్రవాహాలతో కలిపి 3.18 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను తెరిచారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2.24 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లను తెరిచి ఉంచారు. కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది. నీటి ప్రవాహం పుష్కరఘాట్ మెట్లను తాకింది. కృష్ణా పరీవాహకంలో వర్షాలు లేకపోవడం వల్ల ప్రవాహాలు నమోదు కాలేదు. 


సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 28.11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సింగూరుకు 8,434 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. దిగువకు విడుదల చేయడం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 17.08 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పై నుంచి 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా పూర్తి స్థాయిలో నీరు నిండుగా ఉంది. పై నుంచి 64 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వస్తుండగా.. దిగువకు అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు.


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 18.56 నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,18,810 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. 3,41,337 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డ) కు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి 2,24,320 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. 2,24,890 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా.. అంతే స్థాయిలో కిందికి వదులుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఆయా ప్రాజెక్టులకు నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో రావడం లేదు.