Heavy Temparatures in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో మంగళవారం 37 మండలాల్లో వడగాల్పుల ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించారు.


ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్


అటు, తెలంగాణలోని (Telangana) 15 జిల్లాల్లో వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచినీరు ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని.. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు.