Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాలో మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, 18 జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ ఉన్నాయి. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఉన్నాయి.
మరో పక్క రాష్ట్ర వ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి ప్రారంభమై సోమవారం అంతా పడుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో కుండపోతగా కురిశాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ. వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.
ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ ఏకధాటిగా వర్షం పడింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో సోమవారం 10 సెం.మీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 8.9, కొండాపూర్‌లో 8.8, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 7.7, మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ 7.6 సెంటీమీటర్లు చొప్పున వాన పడింది.
స్తంభించిన జనజీవనం
సోమవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. నిజామాబాద్ జిల్లా మోపాల్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండలలో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని మండలాల్లో వంతెనలపై నుంచి ప్రజలు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేటలలో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గాంధారిలోని తిప్పారం వాగు ఉద్ధృతికి మహిళా సంఘం సభ్యురాలు సుకన్యకు చెందిన ఫిష్ పాండ్ కట్ట తెగి రూ.లక్ష విలువైన చేపలు వరదలో కొట్టుకుపోయాయి. మాతుసంగెం గ్రామానికి చెందిన రైతు గౌరీ సంగయ్య వరదలో చిక్కుకుపోగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అధికారులతో మాట్లాడి బాధితుడిని రక్షించారు.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రారంభమయ్యింది. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మధ్యాహ్నం సమయంలో నాలుగు గేట్లు తెరిచారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 33 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు తెరిచి దిగువకు వదిలారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు మానేరు, ఇతర స్థానిక వాగులనుంచి ప్రవాహం వస్తోంది. దీంతో మేడిగడ్డ నుంచి దిగువకు 1.66 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో 36.81 మీటర్ల మట్టం నమోదవ్వగా, నదిలో 78,663 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
ప్రాజెక్టుల్లో నీటి వివరాలు
సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.18 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 3,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. అలాగే నిజాం సాగర్‌లో 16.50 టీఎంసీలు ఉండగా 35,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 89.75 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లో 51,000 క్యూసెక్కులు ఉండగా దిగువకు 12,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో 6.62 నిల్వ ఉండగా 33,244 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అలాగే 43,485 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 18.98 టీఎంసీలు ఉండగా 42,538 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. 43,120 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.