Rains in Telangana Today | హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒక్కసారిగా మారిపోనున్న వాతావరణందక్షిణ తెలంగాణలో నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి- కొత్తగూడెంలలో కొన్నిచోట్ల వర్షాలు దంచికొట్టనున్నాయి. హైదరాబాద్ - దక్షిణాది ప్రాంతాలలో కొన్నిచోట్ల వాతావరణం పొడిగా ఉంటుంది. తరువాత హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి - భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్‌లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుండి నిర్మల్, మంచిర్యాల వరకు అక్కడక్కడా భారీ వర్షాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెంలో రానున్న 2 గంటల్లో కుండపోతకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న జిల్లాల ప్రజలు సాయంత్రం తరువాత అత్యవసరమైతే తప్పా వర్షాలు కురుస్తున్న సమయంలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
రాబోయే మూడు రోజులు వర్షాలువాతావరణ శాఖ తాజా ప్రకారం, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అదే సమయంలో, సెప్టెంబర్ 25వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి, సెప్టెంబర్ 26 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం సెప్టెంబర్ 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాన్ని తాకే అవకాశముందని అంచనా వేశారు.