Rains in Hyderabad | హైదరాబాద్: ఇటీవల ఓ అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి. అంతలోనే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి మరో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అధికారులు సూచించిన జిల్లాల్లో అవసరమైతే తప్పా ఇండ్ల నుంచి సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దు.
సాయంత్రం నుంచి వరుణుడి ప్రతాపం...ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి మొత్తం సెంట్రల్, ఈస్ట్ తెలంగాణతో పాటు నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగాం, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల జిల్లాల్లోనూ సాయంత్రం నుంచి రాత్రి, తెల్లవారుజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే 24 గంటలలో 30-60 మి.మీ వర్షపాతం నమోదు కానుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్, మూసీ, హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, కడెం సహా ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎంత ఇన్ ఫ్లో వస్తుందో అంతకంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ వర్ష సూచన – ఆగస్టు 17, 18బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తాజా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
హెచ్చరిక-1: అతి భారీ వర్షపాతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ.
హెచ్చరిక-2: భారీ నుండి అతి భారీ వర్షపాతం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్,
తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.