Telangana Rain: రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈక్రమంలోనే మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ ఇన్ ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద కూడా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది. 43 అడుగులకు చేరితే మొది ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
కడెం ప్రాజెక్టు గేటును ఎత్తిన అధికారులు
అలాగే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. 69.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. కుమురం భీం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 237 అడుగులు ఉంది. కుమురం భీం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1040 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 33,050 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1046 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ ప్రస్తుత నీటిమట్టం 1072 అడుగులకు చేరింది.
వరద ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ
రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది. ఈక్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ఇలాగే 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఎగువన ఉన్న తాలిపేరు, మేడిగడ్డ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రియాంక వరద పరిస్థితిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు.
రహదారులపై నీళ్లు నిలిచి - ట్రాఫిక్ కు అంతరాయం
గోదావరి నదికి వరదలు పోటెత్తడంతో హైదరాబాద్ నుంచి ములుగు జిల్లా మీదుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రం భూపాలపట్నంకు వెళ్లే 163 జాతీయ రహదారి పై టేకులగూడెం గ్రామశివారులో రహదారిపైకి గోదావరి నీరు చేరడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గేంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు సోలమైల్ వద్ద జనగామ - సిద్దిపేట జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో జనగామ నుంచి సిద్దిపేట వెళ్లే ప్రయాణికులు హచ్చన్నపేట, కొడవటూరు వయా బండానాగారం, సలాకపురం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు.